ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400 లిప్‌స్టిక్ ముద్రలతో నిండిపోవడంతో.. వాహనం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ వినూత్న అలంకరణ కారు యజమానికి చివరకు జరిమానా తెచ్చిపెట్టింది.
గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ కారుపై లిప్‌స్టిక్‌తో ముద్దుల గుర్తులు వేయించారు. విదేశాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ ట్రెండ్‌ను చూసిన ఆయన ప్రేయసి.. అదే తరహాలో కారును అలంకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఒక్కో ముద్దు గుర్తును విడివిడిగా వేస్తూ దాదాపు నాలుగు గంటలపాటు ఈ అలంకరణ చేశారు.
ఫొటోలు వైరల్.. పోలీసుల నజర్
కారు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లాయి. దీంతో పోలీసులు వాహనాన్ని గుర్తించి తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించి కారు యజమానికి రూ.5,500 జరిమానా విధించారు. వినూత్నంగా కనిపించాలనే ఉద్దేశంతో చేసిన అలంకరణ కాస్తా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతోపాటు ట్రాఫిక్ పోలీసుల చర్యకు దారితీయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates