ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఫార్చునర్ కారులో ప్రతిరోజూ విధులకు వచ్చే శేషప్ప.. ఆ కారును పక్కన నిలిపి చీపురు పట్టుకుని రోడ్లు శుభ్రం చేస్తారు. బంట్వాల్ మున్సిపల్ కౌన్సిల్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీవన ప్రయాణం కష్టాలను అధిగమించి కలలను సాకారం చేసుకోవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది.
బంట్వాల్ తాలూకా నవూర్‌కు చెందిన శేషప్ప 1996లో రోజుకు రూ.50 కూలీతో మున్సిపల్ కౌన్సిల్‌లో చేరారు. తొలినాళ్లలో సైకిల్‌పైనే విధులకు వెళ్లేవారు. దాదాపు ఐదేళ్ల పాటు సైకిల్ ప్రయాణం సాగింది. అప్పట్లో ఒక్కోసారి కనీస అవసరాలు తీర్చుకోవడానికీ ఇబ్బందులు పడేవారు. అయినా కష్టపడుతూ ఉద్యోగంలో కొనసాగారు. అనంతరం శాశ్వత ఉద్యోగిగా మారారు.
చిన్నప్పటి నుంచీ కార్లంటే శేషప్పకు ఎంతో ఇష్టం. రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సమయంలో కార్లలో వెళ్తున్న వారిని చూసి.. తానూ ఏదో ఒకరోజు కుటుంబంతో కారులో తిరగాలని కలలు కనేవారు. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో తొలుత మారుతి 800 కొనుగోలు చేశారు. దానిని మారుతి ఓమ్నీతో మార్చుకున్నారు. ఆ తర్వాత స్విఫ్ట్, ఆల్టో కార్లను సొంతం చేసుకున్నారు.
తన కుమారుడి కోసం స్కార్పియోను కొనుగోలు చేశారు. ఇటీవల ఆ స్కార్పియోను మార్చి.. 2013 మోడల్‌కు చెందిన పాత టయోటా ఫార్చునర్‌ను తీసుకున్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన వాహనాలన్నీ రుణాల ద్వారానే సమకూర్చుకున్నట్లు శేషప్ప తెలిపారు.
ఉదయం 5 గంటలకే శేషప్ప బీసీ రోడ్డులో పారిశుద్ధ్య విధులకు హాజరవుతారు. మధ్యాహ్నం వరకు రోడ్లు ఊడ్చడంతో పాటు మున్సిపల్ అధికారులు అప్పగించే ఇతర పనులు చేస్తారు. విధులు ముగిసిన తర్వాత రోజువారీ కూలీ పనులకూ వెళ్తారు. ఇంటివద్ద పశువులను పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. పంచాయతీ పరిధిలో నీటి సరఫరా పనుల్లోనూ సహకరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates