రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. వయసు చిన్నదే అయినా క్రీజులో అతను చూపించిన మెచ్యూరిటీకి క్రికెట్ ప్రపంచం ఫిదా అయింది. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన ఈ కుర్రాడు ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు. కేవలం పరుగులు చేయడమే కాదు, అంతర్జాతీయ బౌలర్లను సైతం ఊచకోత కోస్తూ లీగ్ అంతటా తన డామినేషన్ చూపించాడు. అసలు ఈ సీజన్‌లో వైభవ్ బ్యాటింగ్ స్టైల్ చూస్తే ఏ దశలోనూ అతను కొత్త ప్లేయర్ లాగా అనిపించలేదు.
అతని బ్యాటింగ్ స్టాట్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు కొట్టి, 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును చెరిపేశాడు. సన్‌రైజర్స్‌పై కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి తన సత్తా ఏంటో నిరూపించాడు. ఐదు హాఫ్ సెంచరీలు చేసిన వైభవ్.. లక్నో, గుజరాత్ జట్లపై మూడుసార్లు 93, 96, 97 పరుగుల వద్ద అవుటై తృటిలో సెంచరీలు మిస్ చేసుకున్నాడు. ఈ స్కోర్లు చూస్తే అతను బౌలర్లపై ఎంతలా విరుచుకుపడ్డాడో ఇట్టే అర్థమవుతుంది.
కేవలం భారీ షాట్లు మాత్రమే కాదు, స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలోనూ వైభవ్ పక్కా క్లారిటీతో ఉన్నాడు. టోర్నీ మొత్తం 237.30 స్ట్రైక్ రేట్, 48.50 సగటు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా పవర్‌ప్లేలో ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ను వాడుకుంటూ 500కి పైగా పరుగులు చేశాడు. టీ20 చరిత్రలో ఒకే సీజన్‌లో పవర్‌ప్లేలో ఇన్ని పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అలా ఆడుతూ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మార్క్ అందుకున్న రెండో ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సెట్ చేశాడు.
ఇలాంటి రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాక అవార్డులు రాకుండా ఎలా ఉంటాయి? 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ తీసుకున్న వైభవ్, టోర్నీ బెస్ట్ ప్లేయర్‌గా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును ఎగరేసుకుపోయాడు. వీటితో పాటు ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ లాంటి అవార్డులన్నీ ఒకేసారి తన అకౌంట్లో వేసుకున్నాడు. ఏ ఫ్రాంచైజీ అయినా ఒక కుర్రాడి నుంచి ఏం ఆశిస్తుందో, దానికి వంద రెట్ల కంటే ఎక్కువగా ఆడి రాజస్థాన్ విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు.
అవార్డులు తీసుకునే టైంలో వైభవ్ మాట్లాడిన మాటలు అతని మైండ్ సెట్‌ను హైలెట్ చేశాయి. ప్రతి మ్యాచ్ ఒకేలా ఆడలేమని, ఫిట్‌నెస్ ఉంటేనే గాయాలు లేకుండా ఆడగలమని చెప్పడంతో అతని ఆలోచనా ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. టీమ్ మేనేజ్‌మెంట్, సీనియర్లు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే తానిలా ఆడగలిగానని చాలా సింపుల్‌గా చెప్పేశాడు. 15 ఏళ్లకే ఈ రేంజ్ ఫైర్, క్లారిటీ ఉన్న వైభవ్ భవిష్యత్తులో టీమిండియాకు దొరికిన ఒక మంచి ఆస్తి అని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates