పెళ్లికొడుకుల ఎంపిక‌లో కొత్త పోక‌డ‌లు.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌మే!

పెళ్ళికొడుకుల ఎంపికలో కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారిపోతున్నాయా? లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా కాలమే మారిపోతుందో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుని ఎంపిక చేసేందుకు ఇరు కుటుంబాల తరపున గత చరిత్రలు చదివేవారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేవారు. ఏడు తరాల విషయాన్ని ఆరా తీసేవారు. దీంతో పాటు చదువు ఆస్తిపాస్తులు వంటి విషయాలను తెలుసుకునేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. గత రెండు దశాబ్దాల కాలంగా పెళ్లి కొడుకుల ఎంపిక అలాగే పెళ్లి కుమార్తెల ఎంపిక విషయంలో అనుసరిస్తున్న విధానాలు చాలా చిత్రంగా ఉంటున్నాయి. తాజాగా విజయవాడలో జరిగిన ఒక ఘటన ఆసక్తిగా మారింది. తమకు కాబోయే అల్లుడికి సంబంధించి ఆయన వాహనంపై ఉన్న చలానాలు ఎన్ని అనే విషయాలను ఆరా తీశారు. తద్వారా ఇతను బాధ్యతగా ఉంటున్నాడా.. బాధ్యతగా ఉండడం లేదా.. అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం జరిగింది.

అయితే ఇది వినూత్నమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఇది చర్చకు దారి తీసింది. ఇక ఇటీవల కాలంలో వరుడి సిబిల్ స్కోర్ ను పరిశీలిస్తున్నారు. ఆదాయ వ్యయాలను తెలుసుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగంపై దృష్టి పెడుతున్నారు. ఇదంతా చిత్రంగా అనిపించినప్పటికీ వాస్తవం. తెలంగాణలోనే ఇటీవల సిబిల్ స్కోర్ బాగోలేదని ఒక సంబంధాన్ని వదులుకున్న పరిస్థితి కనిపించింది. అలాగే పెళ్లి కుమార్తెల ఎంపికలోను ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒకప్పుడు అందం, గుణగణాలు వంటి వాటిని పరిశీలనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న స్నేహితులు, వారి ఆహార అలవాట్లు.. అదేవిధంగా సెల్ ఫోన్ డిజిటల్ చాటింగ్ వంటి అంశాలను కూడా పెళ్లి పెద్ద‌లు చూస్తున్నారు. సమాజంలో జరుగుతున్న అనేక నేరాలు.. వివాహం అయిన వెంటనే జరుగుతున్న విడాకులు.. సహజీవనం ఇట్లా అనేక అంశాలు ఇప్పుడు పెళ్లికొడుకులు, పెళ్లి కుమార్తెల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అందుకే ముందు జాగ్రత్తగా పెళ్ళికొడుకుల ఎంపికలో కొత్త పోకడలు తెర‌మీదకు వచ్చాయి. అయితే ఇది మాత్రం ఎంతవరకు శాశ్వతం అనేది విషయాన్ని పక్కన పెడితే కొంత మేర‌కు జాగ్రత్తలు తీసుకున్న విషయం అయితే కనిపిస్తోంది.