యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తోడైంది. దీంతో ప్లాస్టిక్ ధరలు మొదలు సముద్ర రవాణా ఖర్చుల వరకు అన్ని పెరిగిన పరిస్థితి. దీంతో.. టీవీల ధరల మీద ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా టీవీల అమ్మకాల మీద ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో పెద్ద తెరల టీవీలు కొనేవారు.. తమ బడ్జెట్ కు తగ్గట్లు తాము కోరుకున్న స్క్రీన్ సైజ్ కంటే తక్కువ ఉండే టీవీలను కొనే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే వినియోగదారుల్లో పెద్ద తెరలకు బదులుగా చిన్న తెరల టీవీలు కొనే కాంప్రమైజ్ అయ్యే డౌన్ ట్రేడింగ్ ధోరణి కనిపిస్తోందని తయారీ సంస్థలు చెబుతున్నాయి.

ఇవన్నీ సరిపోవన్నట్లుగా ఇటీవల కాలంలో డాలర్ తో రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోయిన వైనం కూడా టీవీల ధరల మీద ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద బ్రాండ్లు మాత్రం పెరిగిన ఉత్పత్తి ఖర్చును వినియోగదారుడి మీద వేసే దానికి బదులుగా.. తాము భరించే పరిస్థితి. మిగిలిన ఖర్చుల మీద కోత పెట్టుకుంటున్నాయి.

మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకోవటంతో పాటు.. ధరల్ని పెంచటం ద్వారా మార్కెట్ లో తమ వాటాను కోల్పోయే ప్రమాదం ఉండటంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణంతో అత్యవసరం కాని కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేస్తున్న పరిస్థితి.

ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 55 అంగుళాల టీవీని కొనాలని భావిస్తున్న వారు 50 అంగుళాలకు.. 65 అంగుళాల టీవీ కొనాలని ప్లాన్ చేసుకున్న వారు 55 అంగుళాల టీవీని కొనేస్తున్నట్లుగా చెబుతున్నారు. గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో టీవీల ధరలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. ఆర్నెల్ల క్రితం 32 అంగుళాల టీవీ రూ.9వేలకు లభిస్తే ఇప్పుడది రూ.11 వేలకు చేరుకుందని చెబుతున్నారు. అయితే.. పెద్ద తెరల టీవీల అమ్మకాలకు మాత్రం వాయిదా పద్దతిలో చెల్లింపు విధానం ఆదుకుంటుందని చెప్పాలి.

ఇదే ఈ వ్యాపారాన్ని నిలబెడుతున్న పరిస్థితి. ఈఎంఐ మోడల్ లో టీవీలు కొనే వారు వందకు 90 శాతమని చెబుతున్నారు. ఇలాంటి విధానంలో టీవీ ధర రూ.5వేలు పెరిగినా.. ఈఎంఐలో వందల్లోనే తేడా రావటంతో పెద్దగా ఇబ్బంది లేని పరిస్థితి. ప్రీమియం బ్రాండ్లు.. పెద్ద తెరల టీవీలకు ఉండే డిమాండ్ విషయంలో ఇప్పుడున్న యథాతధ స్థితి కంటిన్యూ అవుతుందని భావిస్తున్నారు.

ఇప్పుడున్న అంతర్జాతీయ అనిశ్చితి వాతావరణంలో పెద్ద తెరల టీవీలు కొనుగోలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతుున్నాయి. దీనికి బదులుగా.. పండుగ సీజన్ నాటికి పరిస్థితులు ఒక కొలిక్కి వస్తే మాత్రం.. ఇప్పుడు తగ్గిన అమ్మకాల లోటు అంతో ఇంతో భర్తీ అవుతాయన్న ఆశాభావంతో మార్కెట్ వర్గాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. దేశీయంగా పెద్ద తెరల టీవీల వైపు ఆసక్తి చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.