చాంపియన్ అవుతారనుకుంటే చెత్తగా ఓడారు..

టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. అజేయంగా సెమీస్‌కు వచ్చిన ఆ జట్టు.. కీలక పోరులో న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టోర్నీలో మొన్నటివరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రొటీస్ జట్టు, అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమైంది. గ్రూప్ దశలో భారత్ వంటి పటిష్ట జట్లనే ఓడించిన సౌతాఫ్రికా, సెమీస్‌లో ఇలా చేతులెత్తేయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (10), ఎయిడెన్ మార్క్రామ్ (18) విఫలం కావడంతో జట్టు కష్టాల్లో పడింది. మిడిల్ ఆర్డర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) కాసేపు పోరాడినా స్కోరు బోర్డు వేగంగా కదల్లేదు. చివర్లో మార్కో జాన్సెన్ 30 బంతుల్లో 55 పరుగులు చేయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర, కోల్ మెక్కాన్చీ తలో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కట్టడి చేశారు.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, కేవలం 12.5 ఓవర్లలోనే ఒకే ఒక వికెట్ కోల్పోయి 173 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ కూడా 33 బంతుల్లో 58 పరుగులు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో వాతావరణం, ముఖ్యంగా మంచు ప్రభావం ఫలితాన్ని శాసించింది. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు సహకరించిన పిచ్, సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మంచు వల్ల బంతిపై పట్టు చిక్కకపోవడంతో సౌతాఫ్రికా బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. మార్కో జాన్సెన్ కేవలం 2.5 ఓవర్లలోనే 53 పరుగులు ఇచ్చుకున్నాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కివీస్ బ్యాటర్ల దాటికి రబడా, ఎన్గిడి వంటి మేటి బౌలర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండి, వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకు ఇది కోలుకోలేని దెబ్బ. గతంలో ఫైనల్ వరకు వచ్చి టీమిండియా చేతిలో ఓటమి చెందిన సౌతాఫ్రికా ఈసారి కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇక న్యూజిలాండ్ మార్చి 8న అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో ఫైనల్ కు సిద్ధమైంది. గురువారం భారత్ vs ఇంగ్లాండ్ మధ్యన రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక న్యూజిలాండ్ తో పోటీకి ఎవరు వస్తారో చూడాలి.