టీ20 వరల్డ్ కప్ 2026లో మరో మ్యాచ్ అసలైన కిక్ ఇచ్చింది. గ్రూప్-డిలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా సాగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సరిగ్గా 187 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. అయితే ఇక్కడితో డ్రామా ముగియలేదు, విజేత ఎవరో తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. చివరికి అదృష్టం సౌత్ ఆఫ్రికానే వరించడంతో ఆఫ్ఘన్ జట్టుకు నిరాశ తప్పలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (59), రయాన్ రికెల్టన్ (61) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 84 పరుగులు చేసి విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. కానీ చివరి ఓవర్లో రబడ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
మొదటి సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్థాన్ 17 పరుగులు చేయగా, సౌత్ ఆఫ్రికా కూడా సరిగ్గా 17 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇక రెండో సూపర్ ఓవర్లో మొదట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేయగా స్టబ్స్, మిల్లర్ ఇద్దరు కలిసి 23 పరుగులు చేశారు.
ఇక ఆఫ్ఘన్ లక్ష్య చెదనలో చేసిన అతిపెద్ద తప్పు ఫామ్ లో ఉన్న గర్బాజ్ ని మొదట దింపకుండా నబీని సూపర్ ఓవర్లో పంపింది. కేశవ్ మహరాజ్ రెండో సూపర్ ఓవర్ వేశాడు. ఇక నబీ ఒక బాల్ డాట్ చేసి రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన గర్బాజ్ వరుసగా 3 సిక్స్ లు కొట్టి ఆశలు నింపాడు. ఇక ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా ఊపిరి పీల్చుకోగా, ఆఫ్ఘన్ క్యాంప్‌లో అందరూ షాక్ లో ఉండిపోయారు.
గుర్బాజ్ అంతటి వీరోచిత పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందకపోవడం ఆ జట్టుకు శాపంగా మారింది. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకోవడం ఆఫ్ఘన్ అభిమానులను కలిచివేస్తోంది. ఏదేమైనా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates