SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్ కమిన్స్, వెన్నునొప్పి కారణంగా వచ్చే ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం కష్టమే అని తెలుస్తోంది. దీంతో కమిన్స్ రాకుంటే ఆ ప్లేస్‌లో జట్టును నడిపించే లీడర్ ఎవరనే చర్చ నడుస్తోంది. ఈ రేసులో నలుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నా, వారి ప్లస్ మైనస్‌లు చూస్తుంటే ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సీనియర్ జయదేవ్ ఉనద్కత్ కు కెప్టెన్సీ అనుభవం ఉన్నా, అతను జట్టులో రెగ్యులర్ ప్లేయర్ కాకపోవడం మైనస్ పాయింట్.

ఇక రేసులో ఉన్న మొదటి వ్యక్తి ట్రావిస్ హెడ్. భారీ హిట్టర్ అయిన హెడ్‌కు కెప్టెన్సీలో 57 శాతం సక్సెస్ రేటు ఉంది. అయితే, అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడం, కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కావడం వల్ల కెప్టెన్సీ బాధ్యతలు అతనికి ఇస్తారా అనేది అనుమానమే. రెండో ఆప్షన్ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ. నాయకత్వ అనుభవం తక్కువే ఉన్నా, విన్ పర్సెంటేజీ (69%) మాత్రం అదిరిపోయింది. కాకపోతే, అతను ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో కెప్టెన్సీ భారం వేసి ఆ ఫ్లోను చెడగొట్టాలని మేనేజ్మెంట్ అనుకోకపోవచ్చు.

మరోవైపు టీమ్ సీనియర్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా రేసులో ఉన్నాడు. ఇంటర్నేషనల్ లెవల్‌లో క్లాసెన్‌కు మంచి అనుభవం ఉంది. కానీ, అతను కెప్టెన్ గా ఉన్నప్పుడు గెలిచిన మ్యాచ్‌లు కేవలం 40 శాతమే. ఈ గణాంకాలు అతని ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఇక్కడే అందరి దృష్టి ఇషాన్ కిషన్ మీద పడింది. ప్రస్తుతం కిషన్ ‘గోల్డెన్ టచ్’ లో ఉన్నాడు. దేన్ని ముట్టుకున్నా అది సక్సెస్ అవుతోంది. 

కిషన్ వైపు మొగ్గు చూపడానికి బలమైన కారణం ఉంది. ఇటీవల జార్ఖండ్ జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపించి తన లీడర్‌షిప్ ఏంటో నిరూపించుకున్నాడు. ఇక రీసెంట్ గా న్యూజిలాండ్ టీ20 సీరీస్ లో చితకొట్టాడు. కిషన్ బ్యాటింగ్ ఫామ్ కూడా జట్టుకు ఎంతో అవసరం.

గతంలో రజత్ పటిదార్ ఆర్సీబీకి ఎలాగైతే అదృష్టంగా మారారో, ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌ కు కిషన్ అలా మారే ఛాన్స్ ఉంది. కిషన్ లో ఉన్న ఆకలి, అతనికి ఉన్న డొమెస్టిక్ కెప్టెన్సీ రికార్డులు అతన్ని రేసులో ముందుంచుతున్నాయి. ప్యాట్ కమిన్స్ రాకపోతే ఎస్ఆర్‌హెచ్‌ ను నడిపించేది ఇషాన్ కిషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

అదృష్టం, నాయకత్వ పటిమ ఉన్న కిషన్ చేతికి ఆరెంజ్ ఆర్మీ బాధ్యతలు వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ కిషన్ కెప్టెన్ అయితే ఎస్ఆర్‌హెచ్‌ కు కొత్త ఎనర్జీ రావడం ఖాయం.