ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు మొబైల్ వాడొద్దని మందలించడంతో బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలారు. ఫిబ్రవరి 4వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఫ్లాట్ నంబర్ 907 బాల్కనీ నుంచి వీరు ముగ్గురూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిందకు దూకడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
మృతులను పాఖి (12), ప్రాచి (14), విశిక (16)గా పోలీసులు గుర్తించారు. తిండి, చదువు.. ఇలా ప్రతి విషయంలోనూ కలిసుండే ఈ ముగ్గురు సోదరీమణులు, కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఫోన్‌లకు అలవాటు పడ్డారు. మెల్లగా అది గేమింగ్ అడిక్షన్ గా మారింది. ముఖ్యంగా ఒక కొరియన్ ఆన్‌లైన్ టాస్క్ బేస్డ్ లవ్ గేమ్‌కు వీరు తీవ్రంగా బానిసలయ్యారని, దానివల్ల స్కూల్‌కు వెళ్లడం కూడా మానేశారని విచారణలో తెలిసింది.
పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు, వారి గేమింగ్ పిచ్చిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ వాడకంపై ఆంక్షలు విధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ చిన్నారులు, క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న వేళ ఆ ముగ్గురు విడదీయలేని బంధంతో మృత్యుఒడిలోకి చేరారు. తీలా మోర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి తరం పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్ మరింత ప్రమాదకరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఆన్‌లైన్ ఆటల కోసం కన్నవారిని, కన్న కలలను వదిలేసి తనువు చాలించడం సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. తల్లిదండ్రులు పిల్లల మొబైల్ అలవాట్లపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో చిన్న పిల్లలలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువవుతున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. పేరెంట్స్ నిందించినా టీచర్ పనిష్మెంట్ ఇచ్చినా తట్టుకోలేనంత బలహీనంగా మారుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates