వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పలు చోట్ల ఘర్షణలు, రాళ్ల దాడులు జరిగాయి. చక్రాయపేట మండలంలోని నాగులగుట్టపల్లె గ్రామంలో నామినేషన్ల విషయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి.. పరస్పరం రాళ్ల దాడికి దారితీసింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి.
అలానే, వేముల, వేంపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న క్రమంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వేంపల్లి మండలం అలవలపాడు క్లస్టర్ పరిధిలో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ జిల్లా రైతు అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డిపై దాడి జరగడంతో, తీవ్ర గాయాలపాలైన ఆయన్ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శాంతిభద్రతల దృష్ట్యా, అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
అయినప్పటికీ.. అవినాష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లిలో నామినేషన్ వేసేందుకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నివాసం నుంచి బయలుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున గుంపులుగా వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. తమ అభ్యర్థులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
144 సెక్షన్..
నియోజకవర్గం వ్యాప్తంగా పులివెందుల పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లర్లు చోటు చేసుకున్న చక్రాయపేటలో రెండు పికెట్లు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై బైండోవర్ కేసులు పెట్టారు.. అయితే.. ఈ దాడులకు మీరంటే మీరే కారణమని వైసీపీ, టీడీపీ నాయకులు పరస్పరం ఆరోపించుకున్నారు. అయితే.. ఈ నెల 1న ప్రారంభమైన మునిసిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సమయంలోనూ ఇలానే దాడులకు పాల్పడడం గమనార్హం. తాజా దాడుల విషయంపై ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates