రామోజీరావు వంటి జర్నలిస్టును సమీపకాలంలోనే కాదు.. భవిష్యత్తులోనూ చూడలేమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం జరిగిన రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీతో తనకు ఉన్న పరిచయం, వారి ప్రయాణానికి సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదా నుంచి కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ కేవలం నాలుగు సార్లు మాత్రమే రామోజీని తాను కలుసుకున్నానని చెప్పారు. ఎప్పుడు కలిసినా.. రామోజీ నుంచి తాను కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నానని చెప్పారు.
ఆ పరిచయం మరిచిపోలేను..
మీడియా రంగంలో రామోజీరావు చేసిన విశేష కృషిని, సమాజ హితం కోసం ఆయన సాగించిన ప్రయాణాన్ని అమిత్ షా కొనియాడారు. మోడీ తొలిసారి ప్రధాన మంత్రి అయిన సమయంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను కూడా హాజరయ్యానని అమిత్ షా తెలిపారు. ఆ సమయంలో తన కారు మధ్యలోనే ఆగిపోయిందని.. అయితే, ఆ సమయంలో చంద్రబాబు, రామోజీ రావులు ఒకే కారులో వస్తూ.. తనకు లిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. అప్పుడే తొలిసారి రామోజీతో తనకు వ్యక్తిగత పరిచయం ఏర్పడిందన్నారు. కానీ, తన గురించి రామోజీకి ఎప్పుడో తెలుసునన్న విషయం అప్పటి వరకు తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
అందెవేసిన చేయి..
జర్నలిజానికి అసిధారా వ్రతం చేసిన రామోజీ.. అన్ని రంగాల్లోనూ అందెవేసినచేయిగా వ్యవహరించారని షా పేర్కొన్నారు. ఎన్నికలు, రాజకీయాలు సమాజ అభ్యున్నతి, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు, వ్యక్తులు, వ్యవస్థలు ఇలా.. అన్ని విషయాల్లోనూ ఆయనకు సమగ్ర అవగాహన ఉందన్నారు. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా.. దానికి రామోజీ వద్ద పరిష్కార మార్గాలు ఉంటాయన్నారు. తాను కలుసుకున్న నాలుగు సందర్భాల్లో అనేక విషయాలు చర్చకు వచ్చాయన్నారు. ముఖ్యంగా ఈశాన్య భారతంలోని రాష్ట్రాల సమస్యలపై రామోజీ పలు మార్లు తనవద్ద ప్రస్తావించారని చెప్పారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు తనకు ఒక మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. జర్నలిజంలో అనేక కొత్త పుంతలు తొక్కారని చెప్పారు. రామ్నాథ్ గోయంకాతో పోల్చదగిన ఏకైక పాత్రికేయుడు రామోజీనేనని కొనియాడారు.
యూపీ ఎన్నికలపై..
యూపీలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు.. తానే స్వయంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశానని షా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రామోజీ నుంచి తనకు సమాచారం అందిందన్నారు. యూపీలోని ప్రతి గల్లీలోనూ ఓటరు నాడిని ఆయన పట్టుకున్నారని.. ఆ విషయంతెలిసి తనకే ఆశ్చర్యం వేసిందన్నారు. హిందీ రాని వ్యక్తికి.. హిందీ రాష్ట్రంలో ప్రజల నాడి తెలుసుకోవడం అంటే మాటలు కాదన్నా రు. ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన రామోజీ రావు వ్యాఖ్యలు తర్వాత కాలంలో నిజమయ్యాయన్నారు. ఆయనకు సమగ్ర వ్యూహం, భవిష్యత్తుపై పట్టు ఉన్నాయని.. ఏ విషయాన్నయినా ఆయన నిశితంగా గమనిస్తారని, అంచనా వేస్తారని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates