ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మోదీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ మోదీ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతోపాటు వైసీపీ నేతలు హాజరు కావడం విశేషం.
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం గుడికల్ (గుండికల్) గ్రామంలో ‘మాతా శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 14 సెంట్ల స్థలంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
హీరాబెన్ విగ్రహంతో పాటు శివుడు, దక్షిణామూర్తి, శ్రీరాముడు, గణేశుడు ఆలయాలను కూడా నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఇదే ప్రాంగణంలో గోశాల, అనాథాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి రూ.3 లక్షల వ్యయంతో హీరాబెన్ మార్బుల్ విగ్రహాన్ని సిద్ధం చేశారు.
సాధారణ కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీకి జన్మనిచ్చిన హీరాబెన్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. దేశానికి అత్యున్నత స్థాయిలో సేవ చేసిన వ్యక్తిని పెంచి పోషించిన తల్లిగా ఆమె చేసిన సేవలను గౌరవించడానికే ఈ ఆలయ నిర్మాణం చేపట్టామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates