బాబు నివాసానికి షర్మిల… వివాహ ఆహ్వానం కోసమే కాదు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ష‌ర్మిల‌.. హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న సీఎం చంద్ర‌బాబు సొంత నివాసానికి చేరుకున్నారు. త‌న కుమారుడు రాజా రెడ్డితో క‌లిసి వెళ్లిన ఆమె.. త‌న కుమార్తె అంజ‌లి వివాహ ప‌త్రిక‌ను సీఎం చంద్ర‌బాబుకు అందించారు. ఈ నెల 25న త‌న కుమార్తె వివాహం జ‌ర‌గ‌నుంద‌ని.. త‌ప్ప‌కుండారావాల‌ని.. వ‌ధూవ‌రులను ఆశీర్వ‌దించాల‌ని ష‌ర్మిల కోరారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు.. అంజ‌లి స‌హా కాబోయే భ‌ర్త ర‌ఘురామ్ రెడ్డిల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. వారి వివాహ మహోత్స‌వానికి త‌ప్ప‌కుండావ‌స్తాన‌ని, ఆశీర్వ‌దిస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ష‌ర్మిల ఎక్స్‌లో పేర్కొన్నారు.

క‌ట్ చేస్తే..
అయితే.. చంద్ర‌బాబుతో ష‌ర్మిల భేటీ కేవ‌లం వివాహ శుభ‌ప‌త్రిక ఇవ్వ‌డం వ‌ర‌కే ప‌రిమితం కాలేద‌ని మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనికి ముందు.. ష‌ర్మిల‌.. సుమారు ప‌దినిమిషాలకు పైగానే చంద్ర‌బాబు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించార‌ని అంటున్నాయి. ఆదివారం సాయంత్రం 5.40 నిమిషాల‌కు ష‌ర్మిల చంద్ర‌బాబు నివాసానికి వెళ్లారు. అయితే.. 6.10 నిమిషాల‌కు మీడియాకు స‌మాచారం ఇచ్చారు. ఈ మ‌ధ్య కాలంలోనే ష‌ర్మిల వివాహ ప‌త్రిక‌ను చంద్ర‌బాబుకు ఇచ్చిన‌ట్టుగా ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ.. ప‌త్రిక ఇచ్చిన త‌ర్వాత‌.. 10 నిమిషాల‌కు పైగానే ష‌ర్మిల చంద్ర‌బాబుతో చ‌ర్చించార‌ని చెబుతున్నారు. దీనిపైనే ఇప్పుడు ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.

రెండు విష‌యాలు కీల‌కం..

ష‌ర్మిల‌.. త‌న కుమార్తె వివాహానికి సంబంధించిన కీల‌క అంశాల‌ను చంద్ర‌బాబుతో పంచుకుని ఉంటార‌ని అంటున్నారు. బెంగ‌ళూరులోని త‌మ ప్యాలెస్‌లో వివాహం చేసుకునేంందుకు ముందు ప్రిపేర్ అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ పేచీ పెట్టిన విష‌యం మీడియాల్లో వ‌చ్చింది. దీనిపై అన్నాచెల్లెళ్ల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ప‌ర‌స్ప‌ర వాద‌న కూడా వెలుగు చూసింది. దీంతో వేదిక‌ను మార్చుకుని.. పత్రిక‌ల‌ను తిరిగి ముద్రించారు. ఈ ప‌రిణామాల‌పై స్థానిక ఎన్నిక‌ల స‌మయంలో చంద్ర‌బాబు కూడా స్పందించారు. సొంత మేన‌కోడ‌లు వివాహానికి ఇంటిని ఇచ్చేందుకు జ‌గ‌న్‌కు మాన‌సురాలేద‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌పై ఇరువురు చ‌ర్చించిన‌ట్టు ఓ వ‌ర్గం మీడియా చెబుతోంది.

ఇక‌, రెండో విష‌యానికి వ‌స్తే.. వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ద‌ర్యాప్తు అంశాల‌పై ష‌ర్మిల సీఎంచంద్ర‌బాబుతో చ‌ర్చించార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. వివేకాకుమార్తె సునీతా రెడ్డి ఓ వైపు న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. త‌న‌కు ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయ‌ని, వాటిని కూడా నివృత్తి చేయాల‌ని, ముఖ్యంగా తెల్ల‌వారుజామునే జ‌గ‌న్‌,ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిల‌కు పోన్లు ఎలా వెళ్లాయో.. ఎవ‌రు చేశారో కూడా తేల్చాల‌ని సునీత కోరుతున్నారు. ఇక‌, కీల‌క నిందితుల‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. ఈ అంశాల‌పై కూడా ష‌ర్మిల‌.. సునీత విజ్ఞ‌ప్తి మేర‌కు చంద్ర‌బాబుతో చ‌ర్చించి ఉంటార‌ని అంటున్నారు. ఏదేమైనా ఆ 10 నిమిషాల చ‌ర్చ‌ల‌పై మీడియా వ‌ర్గాల్లో విస్తృతంగా వ్యాఖ్యానాలు రావ‌డం గ‌మ‌నార్హం.