ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారంపై తమ కుటుంబానికి సంబంధించి అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారంటూ వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికకు వెలగపూడికి చెందిన రైతు కంచర్ల సాంబశివరావు కుటుంబ సభ్యులు రూ.10 కోట్ల పరువునష్టం నోటీసులు పంపారు. తమ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. పత్రిక మొదటి పేజీ, 14వ పేజీలో ప్రచురించిన ‘గ్రామకంఠం ముసుగులో భూ మాయాజాలం’, ‘రాజధాని భూసమీకరణలో రూ.12 వేల కోట్ల కుంభకోణం’, ‘బాబు ప్యాలెస్‌కు భూమిచ్చినందుకు గ్రామకంఠం నజరానా’ వంటి కథనాల్లో తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి భూమి విక్రయించినందుకు ప్రతిఫలంగా తమ కుటుంబానికి చెందిన 1.76 ఎకరాల భూమిని గ్రామకంఠం పేరుతో భూసమీకరణ నుంచి మినహాయించారని ఆరోపించడాన్ని కంచర్ల కుటుంబం తీవ్రంగా ఖండించింది. వెలగపూడి గ్రామంలోని సర్వే నంబర్ 91/1ఎఫ్‌లో తమ కుటుంబ సభ్యులెవరికీ భూమి లేదని కంచర్ల కుటుంబం స్పష్టం చేసింది. ఆ సర్వే నంబర్‌లోని 1.76 ఎకరాల భూమికి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. భూసమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తాము ఏనాడూ దరఖాస్తు చేయలేదని, ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని పేర్కొంది.
వాస్తవానికి జగన్ పత్రిక ప్రచురించిన ప్రభుత్వ భూ రికార్డుల్లోనే సర్వే నంబర్ 91/1ఎఫ్‌కు సంబంధించి తమ కుటుంబ సభ్యుల పేర్లు లేవని నోటీసులో వివరించారు. అయినప్పటికీ రూ.6.38 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం తమకు నజరానాగా ఇచ్చినట్లు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. 2025 ఏప్రిల్ 2న జరిగిన భూమి విక్రయం పూర్తిగా చట్టబద్ధమైన లావాదేవీ అని కంచర్ల కుటుంబం స్పష్టం చేసింది. భూమికి తగిన ధర చెల్లించి, చట్టప్రకారం రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపింది. ఈ లావాదేవీకి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని, ఎవరి నుంచి ఎలాంటి హామీలు తీసుకోలేదని పేర్కొంది.
తమ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలతో కథనాలు ప్రచురించే ముందు పత్రిక ప్రతినిధులు కనీసం తమను సంప్రదించలేదని నోటీసులో ఆక్షేపించారు. తమ వివరణ తీసుకోకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా అవినీతి ఆరోపణలతో కథనాలు ప్రచురించడం బాధ్యతా రాహిత్యమని పేర్కొన్నారు. కంచర్ల సాంబశివరావు కుటుంబానికి వెలగపూడి గ్రామంలో సుదీర్ఘ చరిత్ర ఉందని నోటీసులో వివరించారు. సాంబశివరావు తండ్రి కంచర్ల అంజయ్య స్వాతంత్ర్య సమరయోధుడని, ఆయన భార్య శాంతకుమారి వెలగపూడి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా సేవలందించారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం తమ కుటుంబం భూసమీకరణ పథకంలో భూములు ఇచ్చిందని తెలిపారు.
జీవితమంతా వ్యవసాయానికి, సమాజ సేవకు అంకితమైన కంచర్ల సాంబశివరావు వంటి వృద్ధ రైతుపై అవినీతి ఆరోపణలు చేయడం వల్ల ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని నోటీసులో పేర్కొన్నారు. సమాజంలో తమ కుటుంబానికి ఉన్న గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఈ కథనాలు ఉన్నాయని తెలిపారు. పత్రిక యాజమాన్యం నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కంచర్ల కుటుంబం డిమాండ్ చేసింది. ఆరోపణలు ప్రచురించిన మొదటి, 14వ పేజీల్లో అదే ప్రాధాన్యంతో క్షమాపణ ప్రచురించాలని కోరింది. నిర్దేశించిన గడువులోగా స్పందించకపోతే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356 ప్రకారం క్రిమినల్ ఫిర్యాదు చేయడంతో పాటు రూ.10 కోట్ల నష్టపరిహారం కోసం సివిల్ దావా వేస్తామని హెచ్చరించింది.
This post was last modified on November 15, 2026 8:17 pm
ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మిగిలిపోయిన కార్పొరేషన్ స్థానాలకు, అలానే మునిసిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో…
ఏపీ సీఎం చంద్రబాబుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం షర్మిల.. హైదరాబాద్‌లోని…
వచ్చే శుక్రవారం దక్షిణాదిన మంచి అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమా.. ఆకాశంలో ఒక తార. దుల్కర్ సల్మాన్ హీరోగా…
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక శక్తిగా ఎదుగుతోంది. ఈ మార్పులో ఎన్విడియా సంస్థ పోషిస్తున్న పాత్ర…
న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కిన సామాన్యుడికి తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కేసు నమోదు చేసినప్పటి…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి సినిమా గురించి నిన్న వచ్చిన ప్రకటన ఇటు సినీ రంగంలో, అటు అభిమానుల్లో…