ఒకప్పుడు భారత క్రికెట్లో లలిత్ మోదీ మాటకు ఎంతో విలువ ఉండేది. ఐపీఎల్‌ను ప్రారంభించి బీసీసీఐకి భారీ ఆదాయం వచ్చేలా చేసిన అతడు 2010లో దేశం విడిచి వెళ్లిపోయాడు. ఆర్థిక అవకతవకల ఆరోపణలు, బీసీసీఐ జీవితకాల నిషేధంతో అప్పటి నుంచి లండన్‌లోనే ఉంటున్నాడు. ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వం కూడా పొందాడు. అయితే భారత్‌లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీకి ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది.
2008లో ఐపీఎల్ ప్రారంభం కావడంలో లలిత్ మోదీ కీలక పాత్ర పోషించాడు. కానీ రెండేళ్లకే పరిస్థితి మారిపోయింది. లీగ్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలు, ప్రసార హక్కుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2010లో బీసీసీఐ సస్పెండ్ చేయగా, 2013లో జీవితకాల నిషేధం విధించింది. మరోవైపు మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. 2015లో ముంబై ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మోదీ ఖండిస్తూ వస్తున్నాడు.
లలిత్ మోదీ బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించిన కార్యక్రమం సెప్టెంబర్ 15నే పూర్తయింది. కానీ నవంబర్ 14న ఆక్స్ఫర్డ్ యూనియన్‌లో ప్రసంగించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్ రాజు చార్లెస్ పుట్టినరోజున ప్రకటన చేయడం తనకు ప్రత్యేకమని చెప్పాడు. బ్రిటన్ ఎన్నో ఏళ్లుగా తనకు నివాసంగా ఉందని, ఆ దేశ పౌరుడిగా మారడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు.
అయితే బ్రిటిష్ పౌరసత్వం పొందినంత మాత్రాన భారత్‌లోని కేసులు రద్దు కావు. భారత్, బ్రిటన్ మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. బ్రిటిష్ పౌరుడిని కూడా మరో దేశానికి అప్పగించేందుకు అక్కడి చట్టాలు అవకాశం కల్పిస్తున్నాయి. కానీ అందుకు సంబంధిత కేసుల్లో తగిన ఆధారాలు, కోర్టు అనుమతులు అవసరం. గతంలో లలిత్ మోదీని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2012లో అతడిని దేశానికి పంపించాలని బ్రిటన్ను భారత్ కోరింది. అయితే ఇప్పుడు అతడి అప్పగింతకు సంబంధించి కొత్తగా ఎలాంటి అధికారిక ప్రక్రియ ప్రారంభమైనట్లు కనిపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
