న‌ట‌రాజ‌న్ స్థానంలో సందీప్‌. ఎవ‌రీయ‌న‌… స్పెష‌ల్ ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియ‌మితుల‌య్యారు. తాజాగా హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆ పార్టీ అగ్ర‌నేత‌ రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో శ‌నివారం సాయంత్రం ఆయ‌న పేరు ప్ర‌క‌ట‌న‌తోపాటు బాధ్య‌తల స్వీకారం కూడా జ‌రిగిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ఇంచార్జ్‌గా ఉన్న సీనియ‌ర్ నేత మీనాక్షి న‌ట‌రాజ‌న్ స్థానంలో సందీప్‌ను నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. 50 ఏళ్ల వ‌య‌సున్న సందీప్‌.. క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌. చిక్కమగళూరు ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సందీప్‌ కొనసాగుతున్నారు.

గతంలో ఆయన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలలో కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ లో రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కన్వీనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో కూడా చురుగ్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక నేతల మధ్య సమన్వయం సాధించేందుకు అధిష్ఠానం ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

గాంధీల‌కు న‌మ్మిన బంటు..

యువ నాయ‌కుడిగా 20 ఏళ్ల వ‌య‌సులోనే కాంగ్రెస్‌పార్టీ తీర్థం పుచ్చుకున్న సందీప్‌.. గాంధీల కుటుంబానికి న‌మ్మిన బంటుగా వ్య‌వ‌హ‌రించారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కుడిగా ఎదిగారు. ప్ర‌జాక్షేత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేయ‌క‌పోయినా.. పార్టీని సంస్థాగ‌తం గా బ‌ల‌పేతం చేయ‌డంలోను.. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంలోనూ సందీప్ మంచి మార్కులు వేయించుకున్నారు.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ స‌ర్కారు ఏర్ప‌డేందుకు, కేర‌ళ‌లో ఏర్పాటుచేసేందుకు కూడా ఆయా ఎన్నిక‌ల్లో విశేష కృషి స‌ల్పారు. చిత్రం ఏంటంటే.. త‌మిళ‌నాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లిన కాంగ్రెస్‌.. తీరా డీఎంకే ఓడిపోవ‌డంతో ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. టీవీకేతో చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. నాడు విజ‌య్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన ముఖ్య కాంగ్రెస్ నేత‌ల్లో సందీప్ ఒక‌రు కావ‌డం గ‌మ‌నార్హం.