కోటి రూపాయ‌లు ప‌లికిన `స‌ర్పంచ్` ప‌ద‌వి!

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. మూడు విడ‌త‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. తాజాగా తొలి విడత ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ విడుద‌లైంది. ఈ నెల 15 (ఆదివారం) నుంచి నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభం కానుంది. అలానే.. ఈ నెల 29న తొలి విడ‌త ఎన్నిక‌ల పోలింగ్ కూడా జ‌ర‌గ‌నుంది. మ‌రో రెండు విడ‌త‌ల‌కు కూడా ఈ నెల‌, వ‌చ్చే నెల 2లోపు ఎన్నిక‌లు పూర్తికానున్నాయి. దీనికి సంబంధించిన ప్ర‌క్రియ ఒక‌వైపు శ‌ర వేగంగా కొన‌సాగుతోంది.

అయితే.. ఈ ప‌ర్వం ఎలా ఉన్నా.. మ‌రోవైపు గ్రామ పంచాయ‌తీల‌కు కీల‌క‌మైన స‌ర్పంచ్ ప‌ద‌వులు ఏక‌గ్రీవం కావ‌డంతోపాటు వేలం పాట‌లు కూడా పాడుకుంటున్నారు. రాష్ట్రంలోని ప‌లు గ్రామాల్లో ఈ ప‌ద‌వుల‌ను రూ.ల‌క్ష‌లు వెచ్చించి మ‌రీ కొంద‌రు ద‌క్కించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. కాకినాడ జిల్లా గొల్ల‌ప్రోలు మండ‌లంలోని దుర్గాడ గ్రామ పంచాయ‌తీలో సర్పంచ్ పదవికి శ‌నివారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ మ‌ద్ద‌తు దారుడైన ఓ వ్య‌క్తి.. ఏకంగా కోటీ 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ఈ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఈ సొమ్మును వారం రోజుల్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. సొమ్మును గ్రామ అభివృద్ధికి కేటాయించ‌నున్నారు.

మ‌రిన్ని చోట్ల‌..

+ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కొప్పలకొండ గ్రామ ప‌రిధిలోని సర్పంచ్ పదవికి నిర్వహించిన వేలం పాటలో ఎల్‌ఐసీ ఆదినారాయణ 29 లక్షల రూపాయ‌ల‌కు పాడి పదవిని దక్కించుకున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన నిధులతో స్థానిక శ్రీరామాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

+  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం వేలం పాటలు జరిగాయి. కొందరు అభ్యర్థులు 50 లక్షల రూపాయ‌ల‌కు ఆయా ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్నారు. మ‌రో వ్య‌క్తి.. ఏకంగా త‌న‌కు ఉన్న భూముల్లో ఎకరా భూమిని గ్రామ దేవత పేరున రాస్తామని, గుడి కట్టిస్తామని ప్ర‌క‌టించి.. స‌ర్పంచ్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు.

+ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం ప‌రిధిలోని ఓ గ్రామంలో తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రెండెకరాల పొలం రాసిస్తానని ఓ నాయకుడు బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఆయ‌న‌ను ఎన్నుకునేందుకు గ్రామ‌స్తులు చేతులు క‌లిపారు. ఇలా.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ముందే వేలం పాట‌లు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.