మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా అంటే వాతావరణం అలాగే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జగన్ పెద్ద కూతురు రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. లండన్‌లో ఉంటున్న ఆమె ఆంధ్రప్రదేశ్ కు వచ్చి శిక్షణ పొందుతున్నట్లు ఊహాగానాలు కూడా వచ్చాయి. అనూహ్యంగా ఇప్పుడు వైఎస్ భారతి తెర మీదకు వచ్చింది. అర్జెంట్ గా వైఎస్ భారతిని రాజకీయాల్లోకి తీసుకొనిరమ్మంటూ సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు చేసిన డిమాండ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, చర్యలు తీసుకోవాలని కోరడానికి వైసీపీ నేతల బృందం శనివారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్లే సరికి డీజీపీ లేరు. దాంతో ఆఫీసులో వున్న ఇతరా అధికారికి వినతిపత్రం అందించి వచ్చారు. ఈ సందర్బంగా డీజీపీ ఆఫీసు ఎదుట సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ భారతిని రాజకీయాల్లో తీసుకొని రావాల్సిన అవసరం వుందని చెప్పారు. సుధాకర్ బాబు ఏమన్నారంటే….
డీజీపీ కార్యాలయం ముందు నుంచి తాను చేతులు జోడించి వైఎస్ జగన్‌ను కోరుతున్నాను. భారతమ్మను తక్షణమే క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొనిరండి. దేశంలో ఒక్క నరేంద్ర మోదీ తప్ప మిగిలిన ప్రముఖ నేతల కుటుంబ సభ్యులందరూ రాజకీయాల్లో వున్నారు. సోనియా గాంధీ పిల్లలు రాహుల్, ప్రియాంక గాంధీలు, కేసీఆర్ పిల్లలు కేటీఆర్, కవితలతో పాటు పవన్ కల్యాణ్ సోదరులు నాగబాబు, చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. మనమేందుకు భయపడాలి.
ప్రస్తుతం వైసీపీ నుంచి జగన్ ఒక్కరే రాజకీయాల్లో వున్నారని తెలిపారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రస్థావించారు. విజయసాయి రెడ్డి ఎపిసోడ్‌ను చూశాక ఎవరినీ నమ్మడానికి వీల్లేకుండా పోయిందన్నారు. అందుకే తక్షణమే భారతమ్మను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుతున్నట్లు సుధాకర్ బాబు విజ్ఞప్తి చేశారు. అయితే సుధాకర్ బాబు సొంతంగానే ఈ ప్రకటన చేశారా లేకపోతే ఎవరైనా చెప్పించారా అనేది చర్చగా మారింది.
వైఎస్ భారతి రాజకీయాల్లోకి వస్తారని గతంలో అనేక సందర్భాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు కూడా ఈ ప్రచారం మరింత విస్తృతంగా జరిగింది. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఒకదశలో జైలుకు వెళ్లే అవకాశం వుందని తీవ్రంగా ప్రచారం జరిగింది. అప్పుడు జగన్ స్థానంలో భారతిని ముఖ్యమంత్రిని చేయనున్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి డిమాండ్ మొదలైంది. అంటే పార్టీ లోపల ఏమైనా జరుగుతుందా… కేసుల వ్యవహారంలో ఏమైనా సంకేతాలు ఉన్నాయా అనేది కొన్ని రోజులు పోతే కానీ స్పష్టంగా తెలియదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
