తిరుమ‌ల శ్రీవారిని`క‌ళ్ల‌కు క‌ట్టిన` చిత్ర‌కారుడు ఇక లేరు!

అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడు తిరుమ‌ల శ్రీవారిని ఈష‌ణ్మాత్రం ద‌ర్శించుకునేందుకు త‌హ‌త‌హ‌లాడిపోయే వారు ఎంద‌రో!. లిప్త‌కాలమే అయినా.. వైకుంఠ‌దాముడిని ద‌ర్శించుకుందామ‌ని అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి ..తిరుమ‌ల‌కు చేరుకుంటారు. గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో వేచి ఉంటారు. తీరా ద‌ర్శ‌నం స‌మ‌యం వ‌చ్చాక‌.. `ప‌దండి.. ప‌దండి` అంటూ భ‌ద్ర‌తా సిబ్బంది తోసేస్తుండ‌గా.. క్యూలైన్ల‌లో ముందున్న వారు.. వెనుకున్న వారి మ‌ధ్య గాబ‌రా ప‌డుతూ.. అడుగులు వేసుకుంటూ.. కుల‌శేఖ‌ర ప‌డి వ‌చ్చాక‌.. తొంగితొంగి చూస్తున్న స‌మ‌యం.. క‌నులు విప్పారి శ్రీవారి నిండు విగ్ర‌హాన్ని క‌నీసం ద‌ర్శించుకోకముందే.. క్యూలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం ప‌రిపాటే!!..

“అయ్యో.. పూర్తిగా ద‌ర్శించుకోలేక పోయామే.. స్వామిని!“ అని అనుకోని వారు. కుదిరితే ఇంకోసారి ఇప్పుడే క్యూలోకి వెళ్లిపోతా.. అని అన‌ని వారు ఉండ‌రేమో!. జ‌గ‌న్మోహ‌నాకారుడైన తిరుమ‌ల శ్రీవారిని వేనోళ్ల పొగ‌డ‌డ‌మే కాదు.. వేయిక ళ్ల‌తో వీక్షించినా.. ఆ తృప్తి తీర‌దు. కానీ, పూర్తిస్థాయిలో శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం వంద‌లో ప‌ది మందికే సాధ్యం. మ‌రి ఆ స్వామి నిండు రూపం ద‌ర్శ‌న భాగ్యం ఎప్పుడు?.. అల వైకుంఠ‌పుర‌ములో.. అన్న‌ట్టు.. గ‌ర్భాల‌యంలో శంఖు చ‌క్రాలు ధ‌రించి.. ప‌ద్మాస‌నంపై నిల‌బ‌డిన మూర్తి స్వరూపాన్ని ఆసాంతం వీక్షించి.. పుల‌కించేది ఎన్నుడు? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ, ఆయ‌న దివ్య‌మంగ‌ళ స్వ‌రూపాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చిత్రీకరించిన‌ ప‌టాల‌ను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజించి.. సంతృప్తిని పొందుతాం!.

ఆ చిత్ర‌ప‌టాల‌ను చూస్తే.. ముమ్మూర్తులా నా స్వామి ఇలానే ఉంటారు.. అని అనుకుంటాం. మ‌రి ఈ చిత్రాలు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి? ఫొటోలు ఏమైనా తీశారా? ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఇవి నిషేధం క‌దా!? అనే సందేహాలు వ‌స్తాయి. అవును. నిజ‌మే!. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం తిరుమ‌ల శ్రీవారిని కెమెరాల్లో బంధించ‌డం నిషేధం. అందుకే.. ఆయ‌న దివ్య‌మంగ‌ళ స్వ‌రూపాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థామ‌నే.. అధికారికంగా ముద్రించేందుకు ఓ చిత్ర‌కారుడి సాయాన్ని తీసుకుంది. ఆయ‌నే త‌మిళ‌నాడుకు చెందిన శ్రీనివాస‌న్‌.

ఇప్ప‌టి మాదిరిగా తిరుమ‌ల కిక్కిరిసిపోయిన రోజులు కాక‌పోయినా.. స్వామి నిండు విగ్ర‌హాన్ని ద‌ర్శించుకోలేని వారి కోసం.. సుదూర ప్రాంతాల నుంచి తిరుమ‌ల‌కు రాలేక పోయిన వారి కోసం.. టీటీడీ ఈ ప్ర‌య‌త్నం చేసింది. శ్రీవారి నిండు విగ్ర‌హాన్ని రెండు భంగిమ‌ల్లో వాట‌ర్ క‌ల‌ర్ పేయింటింగ్ వేయించింది. ఈ బాధ్య‌త‌ల‌ను ప్ర‌ముఖ చిత్ర కారుడు శ్రీనివాస‌న్‌కు 1970లో అప్ప‌గించ‌గా.. ఆయ‌న మూడు రోజుల పాటు శ్రీవారి ముందే నిల‌బ‌డి.. త‌న హ‌స్త‌వాసితో చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌గా.. అచ్చం శ్రీవారు.. ప‌ద్మ‌పీఠం నుంచి శ్రీనివాస‌న్ కుంచెలోకి జాలువారారా.. అన్న‌ట్టుగా ఆ చిత్రాల‌ను తీర్చిదిద్దారు.

ప్ర‌స్తుతం టీటీడీ ముద్రించే క్యాలెండ‌ర్లు, ఇత‌ర పుస్త‌కాల్లో ఉండే మూల విరాట్ స్వ‌రూపం.. అప్ప‌ట్లో శ్రీనివాస‌న్ చిత్రీక‌రించిన పేయింటింగ్సే కావ‌డం గ‌మ‌నార్హం. కాగా.. 86 ఏళ్ల శ్రీనివాస‌న్‌.. శ‌నివారం త‌న నివాసంలో క‌న్నుమూ శారు. అనారోగ్య స‌మ‌స్య‌లు, వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యం విష‌మించి తుది శ్వాస విడిచారు.

 భక్తుల కోసం ఆయన స్వామివారిని రెండు రూపాల్లో చిత్రించారు. ఒకటి సర్వాభరణాలతో శోభిల్లుతున్న రూపం కాగా, మరొకటి నగలు లేకుండా సహజసిద్ధంగా ఉన్న నిరాడంబర రూపం. ఈ రెండు చిత్రాలకు టీటీడీ ఆమోదం తెలపడంతో పాటు శివకాశి ముద్రణ సంస్థలు వీటిని క్యాలెండర్లు, చిత్రపటాలుగా ముద్రించాయి. అప్పటి నుంచి ఇవే ఇంటింటా శ్రీవారి ప్రతిరూపాలుగా నిలిచిపోయాయి.