తణుకులో వైసీపీకి భారీ షాక్!

తణుకు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్‌కుమార్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఈ పరిణామం తణుకు వైసీపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా మారింది. త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో తొలిసారి పాగా వేసిన వైసీపీ.. ఇప్పుడు పుంజుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా.. నేల చూపులు చూస్తోంది. పైగా.. అంతో ఇంతో బ‌లంగా ఉన్న బ‌ల‌గం కుటుంబం కూడా ఇప్పుడు వైసీపీకి రాం రాం చెప్ప‌డం ఆ పార్టీని మ‌రింత ఇరుకున ప‌డేసింది.

2019లో గెలిచిన కారుమూరి నాగేశ్వ‌ర‌రావు.. వైసీపీ హ‌యాంలో మంత్రి అయ్యారు. కానీ, ఆయ‌న ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈ స‌మ‌యంలో పార్టీని కాచుకునేందుకు నాయ‌కులు క‌రువ‌య్యారు. ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేస్తార‌ని బ‌ల‌గం కుటుంబంపై జ‌గ‌న్ ఆశ‌లు పెట్టుకున్నా.. కీల‌క ప‌ద‌విని కేటాయించే విష‌యంలో తాత్సారం చేయ‌డంతో వారు పార్టీకే రాం రాం చెప్పేశారు. ఇక‌, కారుమూరి క‌ష్టాల విష‌యాల‌కు వ‌స్తే.. ఈ ఏడాది ఆగస్టులో లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు అరెస్టు అయ్యారు. ఇప్ప‌టికీ వారు జైల్లోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు చెల్లం ఆనంద్ ప్రకాష్‌ను అబ్జర్వర్‌గా నియమించారు. కానీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, తణుకు మున్సిపాలిటీలో కూటమి పార్టీలలో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ ఉండగా, వైసీపీకి అభ్యర్థుల కొరత ఎదురైంది. మరోవైపు, గత వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆధారంగా తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని స్థానిక వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేసినా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, కారుమూరి వివాదం నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో పెద్ద సంచ‌ల‌నంగా మారాయి.

ఈ క్ర‌మంలో తణుకు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్‌కుమార్ వారి కుటుంబ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంధువులు కావ‌డం మ‌రో విశేషం. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మ‌రింత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. వైసీపీ కి చావు దెబ్బ‌గా మారింద‌ని అంటున్నారు. తణుకు మున్సిపల్ ఎన్నికలకు ముందు బలగం కుటుంబం అధికార టీడీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా త‌ణుకులో వైసీపీ నానా అరిష్టాల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం.