హసీనాను బంగ్లాకు పంపడానికి భారత్ షరతులు?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ లో ఆమె బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో భారత్ రెండు కీలక షరతులు పెట్టినట్లు ఓ తాజా నివేదిక పేర్కొంది.

2024 ఆగస్టులో బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున నిరసనలు జరగడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె దేశం విడిచి భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరోవైపు హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ ను కోరుతోంది.

తాజా నివేదిక ప్రకారం, హసీనా తిరిగి వెళ్లే విషయంలో బంగ్లాదేశ్ ఆర్మీ బాధ్యత తీసుకోవాలని భారత్ కోరుతున్నట్లు సమాచారం. ఆమెను తీసుకెళ్లేందుకు సైనిక విమానాన్ని పంపడం లేదా సరిహద్దు వద్ద ఆర్మీ అధికారులు స్వయంగా స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

రెండో షరతు హసీనాపై ఉన్న కేసులకు సంబంధించింది కావడం గమనార్హం. ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, కొత్తగా న్యాయమైన విచారణ జరగాలని భారత్ కోరుతున్నట్లు ఆ వార్త వెల్లడించింది.

2025 నవంబర్ లో బంగ్లాదేశ్ కోర్టు హసీనాకు ఆమె గైర్హాజరీలోనే మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఈ నేపథ్యంలో ఆమెకు న్యాయపరంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండాలని భారత్ కోరుతున్నట్లు సమాచారం.

ఈ అంశంపై భారత్, బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు షరతులు నిజమే ఐతే వీటిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించిందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

డిసెంబర్ లో తిరిగి బంగ్లాదేశ్ కు వస్తానని హసీనా గతంలో చెప్పినప్పటికీ, ఆమె రాక ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. భారత్ పెట్టినట్లు చెబుతున్న ఈ రెండు షరతులకు బంగ్లాదేశ్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.