పులివెందుల పాయే… తాడేపల్లి సంగతేంటి?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుతూనే వున్నాయి. తొలుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కూటమి పై చేయి సాధించింది. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా కూటమి దాదాపుగా క్లిన్ స్వీప్ చేసింది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా మూడు పార్టీల జట్టు విజయ కేతనం ఎగరేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. వరస విజయాలతో కూటమిలో ఉత్సాహం కనిపిస్తుండగా వరస అపజయాలతో వైసీపీ శ్రేణులు డల్ గా వున్నారు.

రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 90 మున్సిపాలిటీలు, 16 నగర పంచాయతీలు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీన 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన వాటికి ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 14 నుండి నవంబర్ 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న ఓటింగ్ జరుగుతుంది. 30న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

తొలివిడత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత సొంత నియోజకవర్గం పులివెందులలో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. సుమారు మూడు దశబ్దాల తర్వాత వైఎస్ కుటుంబం ఓటమి చవి చూసింది. వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. స్వయంగా జగన్ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రం పెద్ద వార్తయ్యింది. వైఎస్ కుటుంబ సభ్యులు పోటీ చేసినా ఓటమి పావడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు రెండో విడత మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి.

మరో వారం పది రోజుల్లో మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మంగళగిరికి ప్రత్యేకత వుంది. ఇది కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ ప్రతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి పరిధిలోని ప్రాంతం. దీంతో మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. మంత్రి లోకేష్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా, లేకపోతే జగన్ ప్రభావం చూపుతారా అనేది తేలిపోతుంది.

మంగళగిరి కార్పొరేషన్ ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం…అధికార టీడీపీ కానీ ప్రతిపక్ష వైసీపీ కానీ ఇప్పటి వరకు మేయర్ అభ్యర్థుల పేర్లను ఇంకా ఖరారు చేయలేదు. టీడీపీ ప్రకటించిన తర్వాత అభ్యర్థిని ప్రకటించాలని వైసీపీ ఎదురు చూస్తుంది. వైసీపీ అభ్యర్థిని చూసిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించాలని టీడీపీ వెయిట్ చేస్తున్నట్లు వినికిడి. ఇరు పార్టీల ఎత్తులు, పై ఎత్తులతో మంగళగిరి రాజకీయం రసవత్తంగా మారింది. ప్రస్తుత పరిస్థితినిబట్టి చూస్తే టీడీపీ విజయం ఖాయమని ప్రచారం జరుగుతుంది. చూద్దాం… ఏమవుతుందో…