“ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు విజన్ ఉంది. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఉంది. ఈ రెండు అంశాలు ఉంటే ఏపీకి ఇంకేం కావాలి?” అంటూ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రశంసలు కురిపించారు. విశాఖపట్నంలో జరిగిన రెండు రోజుల సీఐఐ సదస్సు ముగింపు కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రసంగించారు.
చంద్రబాబుది భారీ విజయం
2024 నుంచి ఇప్పటి వరకు కేవలం రెండున్నరేళ్లలో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, ఇది సాధారణ విషయం కాదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం గొప్ప విజయమని కొనియాడారు. అంతరిక్షం నుంచి సాంకేతిక రంగం వరకు వివిధ రంగాల్లో ఏపీ పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు.
వచ్చే ఏడాది జరిగే సదస్సు కోసం కూడా చంద్రబాబు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారని, ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాధిస్తున్న ప్రగతి అసాధారణమని ప్రశంసించారు.
ఏపీకి ఉజ్వల భవిష్యత్తు
చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్ర విభజన నాటి సమస్యల నుంచి ఏపీ క్రమంగా బయటపడుతోందని, అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో ముందుకు సాగుతోందని చెప్పారు. సుదీర్ఘ సముద్ర తీరం కారణంగా పోర్టుల అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని, యువతను ప్రోత్సహించడంతో పాటు సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. తద్వారా యువత ఆకాంక్షలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. “చంద్రబాబు చేస్తున్నది నిరంతర యజ్ఞం” అంటూ ప్రశంసించారు.
ఎప్పుడు వచ్చినా రాష్ట్రం గురించే..
చంద్రబాబు తనను రెండుసార్లు కలిశారని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేదని, ఎప్పుడూ రాష్ట్రం, ప్రజల గురించే ఆలోచించారని చెప్పారు. ఏపీ అభివృద్ధి, పెట్టుబడులు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎంతో వివరంగా చెప్పేవారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఉన్న తపన స్పష్టంగా కనిపిస్తుందని, ఇలాంటి నాయకుడు ఏపీకి ఉండటం ప్రజలకు ఎంతో అవసరమని సీపీ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
