అమ‌రావ‌తికి ఒబెరాయ్.. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అనేక సంస్థ‌లు పెట్టుబ‌డులు పెడుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు వ‌చ్చేశాయి. ఆర్బీఐ వంటి బ్యాంకింగ్ సంస్థ‌లు కూడా ఇక్క‌డ కార్యాల‌యాన్ని నిర్మించేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. ఇక‌, ప్రైవేటు సంస్థ‌లు, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల నివాసా లు వంటివి కూడా నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. తాజాగా ప్ర‌ముఖ హోట‌ళ్ల సంస్థ‌.. ఒబెరాయ్ కూడా అమ‌రావ‌తికి రానుంది. సుమారు 175 కోట్ల రూపాయ‌ల పైగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ఈ సంస్థ అంగీక‌రించింది. దీనికి సంబంధించి తాజాగా సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే విశాఖ‌లో ఒప్పందం చేసుకుంది.

ప్ర‌త్యేక‌త ఇదే..

ఒబెరాయ్ హోట‌ళ్లు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి చెందాయి. సాధార‌ణంగా నిర్మించే హోట‌ళ్ల‌కు.. ఒబెరాయ్ గ్రూప్ నిర్మించే హోట‌ళ్లు, స‌దుపాయాల‌కు చాలా వ్య‌త్యాసం ఉంది. టాటా వంటివి కూడా హోట‌ళ్లు నిర్మిస్తున్నా.. ఒబెరాయ్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో హోట‌ల్ క‌ట్టాలంటే.. వెనుక‌-ముందు అనేక విష‌యాల‌ను ప‌రిశీలిస్తారు. ఆప్రాంతం అభివృద్ధి, రాబోయే 30 సంవ‌త్స‌రాల కాలంలో ఏమేర‌కు డెవ‌ల‌ప్ అవుతుంది? ఎంత మేర‌కు ఎకాన‌మీ యాక్టివిటీస్ జ‌రుగుతాయి? అనే అంశాల‌ను ఒబెరాయ్ గ్రూప్ ఖ‌చ్చితంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాతే అక్క‌డ హోట‌ల్‌ను నిర్మించేందుకు ముందుకు వ‌స్తుంది.

ఒబెరాయ్ నిర్మించే ప్రతి హోటల్ ఆ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా రాజభవనాల తరహాలో విశాలమైన తోటలు, జలాశయాలతో నిర్మితమై ఉంటుంది. ఉదాహ‌ర‌ణకు ఆగ్రాలోని ది ఒబెరాయ్ అమర్‌విలాస్ లోని ప్రతి గది నుండి తాజ్ మహల్ నేరుగా కనిపిస్తుంది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ పిచోలా సరస్సు ఒడ్డున రాజభవనంలా అలరారుతుంది. అతిథుల కోసం వన్యప్రాణి సఫారీలు, నక్షత్రాల కింద ప్రత్యేక విందులు, ప్రైవేట్ బోట్ రైడ్‌లు, హిమాలయ ప్రాంతాల్లో మౌంటెన్ బైకింగ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ + లీజర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుండి ఒబెరాయ్ రిసార్ట్‌లు తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్లుగా అవార్డులు గెలుచుకుంటున్నాయి. ఈ హోట‌ళ్ల‌కు అంత ప్రాముఖ్యం ఉంది.

అమ‌రావ‌తిని గుర్తించే..

ఇలా.. ప్ర‌తిష్టాత్మ‌క ఒబెరాయ్ సంస్థ అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిందంటే.. ఖ‌చ్చితంగా ఆ సంస్థ రాజ‌ధాని భ‌విష్య‌త్తు, ఇక్క‌డ జ‌రిగే ఆర్థిక అభివృద్ధి వంటివాటిని అంచ‌నా వేసుకుంద‌ని అంటున్నారు అధికారులు. కృష్ణాతీరం, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, డెవ‌ల‌ప్ అవుతున్న విజ‌య‌వాడ‌-గుంటూరు కారిడార్‌, తెలంగాణ‌తో అనుసంధానం ఇలా.. అనేక అంశాల‌ను పరిగ‌ణ‌న‌లో కి తీసుకున్న త‌ర్వాతే.. ఒబెరాయ్ ఒప్పుకొన్న‌ట్టు చెబుతున్నారు. 2025లో ప్రారంభ‌మైన చ‌ర్చ‌లు.. దాదాపు 14 నెల‌ల పాటు సాగాయ‌ని, రెండు సార్లు ఒబెరాయ్ ప్ర‌తినిధులు అమ‌రావ‌తిని సంద‌ర్శించి ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యార‌ని చెబుతున్నారు. మొత్తంగా.. ఇత‌ర సంస్థ‌లు రావ‌డం వేరు.. ఒబెరాయ్ వంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌లు రావ‌డం అమ‌రావ‌తికి అత్య‌త కీల‌క‌మ‌ని అంటున్నారు.