కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పేరు ఉపయోగించుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మోసం కోసం జనసేన నాయకులు కళ్యాణం శివ శ్రీనివాసరావు, వీర మహిళ నాయకురాలు కోట రుక్మిణి పేర్లను ఉపయోగించారు. అంతేకాకుండా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సంబంధించిన లోగో, గుర్తులు, అధికారిక లెటర్‌హెడ్‌లను కూడా నకిలీగా వాడుకున్నారు.
గగర ధరణి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీలో పనిచేసిన ధరణి, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాయకుల పేర్లతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను నమ్మించినట్లు తెలుస్తోంది.
కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రస్తుతం జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఈ వ్యవహారం పార్టీ కార్యాలయం దృష్టికి రావడంతో ఆయన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
