వైసీపీ పంపేయాల‌నుకుంది.. కానీ, కియా విస్త‌రిస్తోంది!

అనంతపురంలో కియా కార్ల తయారీ రెండో ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం చేసుకోవ‌డం.. రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. 2014-19 మ‌ధ్య సీఎం చంద్ర‌బాబు ద‌క్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ‌ను రాష్ట్రానికి ఆహ్వానించి అనంత‌పురంలో కార్ల విడిభాగాల త‌యారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్స‌హించారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. దీనిని కూడా పంపేసేలా ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ నేప‌థ్యంలో కియా అప్ప‌ట్లో త‌న విస్త‌ర‌ణ ప్లాంటును త‌మిళ‌నాడ‌కు తీసుకువెళ్లింది.

అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. కియాతో మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌రిగిన సీఎం చంద్ర‌బాబు.. మూడో ద‌శ విస్త‌ర‌ణ ప్లాంటును ఇక్క‌డే ఏర్పాటు చేసేలా ఒప్పించారు. ఫలితంగా.. కియా తాజాగా మ‌రో ఒప్పందం చేసుకుంది. వైసీపీ నాడు పంపేయాల‌ని చేసిన ప్ర‌య‌త్నం విక‌టించ‌డంతోపాటు.. కియా మ‌రింత విస్త‌రించ‌డం గ‌మ‌నార్హం. తాజా పెట్టుబ‌డితో.. కియా, సరఫరా భాగస్వాముల సంయుక్త పెట్టుబడి 2 బిలియన్ అమెరికన్ డాలర్లు ఏపీకి రానున్నాయి. సుమారు 12 వేల అదనపు ఉద్యోగావకాశాలు…ఏడాదికి 2 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం క‌ల‌గ‌నుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఇండియా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. అనంతపురంలోనే రెండో ప్లాంట్ ఏర్పాటు కానుంది. కియా, దాని సరఫరా భాగస్వాములు కలిసి ఈ ప్రాజెక్టులో 2 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. కియా ప్లాంట్, సరఫరా భాగస్వాముల యూనిట్లకు కలిపి 465 ఎకరాల్లో ఈ విస్తరణ చేపట్టనున్నారు. కొత్త ప్లాంట్‌తో సుమారు 12,000 అదనపు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు ల‌భిస్తాయి. రెండో ప్లాంట్ వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2 లక్షల వాహనాలని కంపెనీ ప్ర‌క‌టించింది.

2030 ప్రారంభంలో రెండో ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించాలని కియా ప్రణాళిక స్ప‌ష్టం చేసింది. కొత్త ప్లాంట్‌లో ICE, ఎలక్ట్రిక్ (EV) వాహనాలకు సంబంధించిన కొత్త మోడళ్లను తయారు చేస్తారు. వాహన తయారీలో కీలకమైన స్టాంపింగ్, వెల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లీ ప్రక్రియలు జ‌ర‌గ‌నున్నాయి. అనంతపురంలో ప్ర‌స్తుతం ఉన్న‌ కియా ప్లాంట్‌కు ఏడాదికి 4.30 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. ప్రస్తుత ప్లాంట్, అనుబంధ యూనిట్ల ద్వారా 24,237 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.