ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. జెండాలు లేకున్నా.. అజెండాలే!

ఏపీలో ఇటీవ‌లి వ‌రకు స్థానిక మునిసిపాలిటీ, కార్పొరేష‌న్‌, ఎంపీటీడీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల సంద‌డి కొన‌సాగింది. కొన్ని చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ప‌రిణామాలు ముగిసి.. కూట‌మి పార్టీల‌కు ప్ర‌జ‌లు జై కొట్టిన విష‌యం తెలిసిందే. మెజారిటీ స్థానాల్లో కూట‌మిపార్టీలు పాగా వేశాయి. మొత్తంగా 94.6 శాతం స్ట్రయిక్ రేట్ కూడా సంపాయించాయి. ఇక‌, ఇప్పుడు మ‌రో ఎన్నిక‌ల సంద‌డి ప్రారంభ‌మైంది.

అయితే.. ఇది న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కే కాదు.. రాజకీయ పార్టీల‌కు కూడా ప్ర‌త్య‌క్ష సంబంధం లేద‌ని గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు. రాజ్యాంగంలోని 73, 74 స‌వ‌ర‌ణ‌ల ద్వారా.. వ‌చ్చిన ప్ర‌త్యేక హ‌క్కుల వినియోగానికి పంచాయ‌తీ ఎన్నికలు త‌ప్ప‌నిస‌రి. అంతేకాదు.. కేంద్రం నుంచి పంచాయ‌తీల‌కు ఇచ్చే గ్రాంట్లు, ఇత‌ర‌త్రా సాయాల‌కు కూడా ఈ ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. ఇక్క‌డ రాజ‌కీయ పార్టీలు నేరుగా త‌ల‌ప‌డ‌వు. అంతేకాదు.. నేరుగా అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించ‌డం నిషేధం. పూర్తిగా ఇది ఇండిపెండెంట్ ఎన్నిక‌.

అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయాలు కొన‌సాగ‌డ‌మే ఈ ఎన్నిక‌ల విశేషం. రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు కంప‌ల్స‌రీగా మారిపోయింది. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన స‌హా క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ త‌మ మ‌ద్ద‌తు దారుల‌ను ప‌రోక్షంగా ఎంపిక చేసుకుంటున్నాయి. జెండాలు లేకున్నా.. అజెండాల‌తో ముందుకు సాగుతున్నాయి. ప్ర‌స్తుతం గ్రామ‌స్థాయిలో ఆయా పార్టీల‌ ప్ర‌చారం.. ఇంటింటికీ తిర‌గ‌డం, ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం.. అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోర‌డం వంటివి షురూ అయ్యారు.

మొత్తంగా మూడు విడ‌త‌ల్లో ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. గ్రామాల స్వ‌రాజ్యానికి ఈ ఎన్నిక‌లే కీల‌క‌మ‌ని చెబుతారు. ఈ నెల‌ 26న తొలి విడత పోలింగ్, అదే రోజు ఫలితాలు కూడా వెల్ల‌డించ‌నున్నారు. నవంబర్ 29న రెండో విడత పోలింగ్ జ‌రిగి ఆ వెంట‌నే ఫలితాలు రానున్నారు. డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు కూడా ఆరోజే వెల్ల‌డిస్తారు. ఈ ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటేందుకు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వ‌ర‌కు.. జిల్లాల ఇంచార్జ్ ల‌నుంచి క్షేత్ర‌స్థాయి నాయ‌కుల వ‌ర‌కు విశేషంగా కృషి చేస్తున్నారు.