విశాఖలో నిర్వహిస్తున్న 31వ సీఐఐ-ఏపీ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులో భారీగా పెట్టుబడులు తరలి వచ్చా యి. ఇదేసమయంలో సీఎం చంద్రబాబుకు ప్రపంచ స్థాయి నాయకుల నుంచిప్రశంసలు కూడా భారీగా దక్కాయి. జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, అబుదాబి సహా పలు దేశాల నుంచి విదేశాంగ మంత్రులు ఈ సదస్సుకు వచ్చారు. వీరంతా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. మెరుగైన పాలన.. ముఖ్యంగా సీఎం చంద్రబాబు పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనియాడారు.
చంద్రబాబు తమకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారని.. సింగపూర్ మంత్రి పేర్కొన్నారు. ఆయన విజనరీ చాలా గొప్పదని దుబాయ్‌కు చెందిన మంత్రి తెలిపారు. వచ్చే 30 ఏళ్ల భవిష్యత్తును ముందుగానే ఊహించగల విజనరీ నాయకుడిగా.. అబుదాబి మంత్రి పేర్కొన్నారు. ఇలా.. ప్రతి ఒక్కరూ చంద్రబాబు దూర దృష్టి, పెట్టుబడుల సాధన, పారిశ్రామిక వేత్తలకు ఆయన ఇస్తున్న సహకారం వంటి వాటిని ప్రశంసించారు. ఇదే వేదికపై పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా.. చంద్రబాబు చొరవను ప్రశంసించారు.
పెట్టుబడుల వెల్లువ..
రెండో రోజు పెట్టుబడుల సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు తరలి వచ్చాయి. పలు సంస్థలు సీఎం చంద్రబాబు సమక్షంలోనే పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 12 ఎంవోయూలు కుదిరాయి. వీటి మొత్తం విలువ లక్ష 14 వేల కోట్లు అని.. ముఖ్యమంత్రి స్వంగా వెల్లడించారు. వీటిలో కీలకమైన హిందాల్కో, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మారిటైమ్ బోర్డు వంటివి ఉన్నాయని చెప్పారు. వీటి వల్ల సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగాలు, మరో లక్షల మంది ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
హిందాల్కోతో ప్రకాశం
ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు హిందాల్కో తరలి రానుంది. ఇక్కడి కందుకూరు నియోజకవర్గంలో మైనింగ్ చేసేందుకు తాజాగా ఒప్పందం చేసుకుంది. దీని విలువ 15 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. 2,500 మందికి ఉపాధి, 500-700మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. కాగా.. హిందాల్కో ప్రపంచ పెట్టుబడి సంస్థల్లో పది అగ్ర సంస్థల్లో ఒకటిగా ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
