ఏపీలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ పారిశ్రామిక సదస్సు రెండో రోజు ఆయన చాలా బిజీగా గడిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖితో పాటు పలువురితో ఒప్పందాలు చేసుకునే విషయంలో ఆయన బిజీగా ఉండిపోయారు. మధ్యలో అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబుడులు భారీగా తరలి వస్తున్నాయని చెప్పారు.
అయితే.. సుస్థిర ప్రభుత్వాన్ని పెట్టుబడులు పెట్టేవారు కోరుకుంటున్నారని, ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపడం లేదని.. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే తమకు మేలు జరుగుతుందని.. విధానాలు కూడా ఒకే తరహాలో కొనసాగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీ అయినా.. ఎక్కడైనా పెట్టుబడులు రావాలంటే సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగాల్సి ఉంటుందన్నారు. దీనికి గుజరాతే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా అక్కడ ఒకే పార్టీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.
దీంతో గుజరాత్‌కు పెట్టుబడులు భారీగా తరలి వచ్చాయని.. ఇప్పుడు అదే విశ్వాసం ఏపీలోనూ కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడలో చాలా శ్రమించాల్సి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నా భిన్నం చేసిందని.. దీంతో అన్నింటినీ ఒక్కొక్కటిగా బాగు చేసుకుంటూ వచ్చామని చెప్పారు. ఇటు ప్రజలకు కూడా సుస్థిర ప్రభుత్వం ప్రాధాన్యం తెలుస్తోందని చంద్రబాబు చెప్పారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న విషయాన్ని స్పష్టం చేసిందన్నారు.
పీ-4, ఇంటికో పారిశ్రామికవేత్త నినాదంతో తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం డిమాండ్ ఉండేదని.. ఇప్పుడు సొంతగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు యువతకు ప్రోత్సాహం ఇస్తుండడంతో యువత కూడా.. పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పీ-4ద్వారా పేదరికాన్ని గణనీయంగా తగ్గించామని చెప్పారు. వచ్చే 2030 నాటికి మెరుగైన ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
