చంపేస్తాం అంటూ మాజీ సీఎంకు ఫోన్ కాల్

ఇటీవల కాలంలో లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆరాచకాలు ఎక్కువై పోతున్నాయి. నిన్నా మొన్నటిదాకా బాలీవుడ్ నటులను టార్గెట్ చేసిన ఈ ముఠా ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కూడా కన్నేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ అధ్యక్షులు అరవింద్​ కేజ్రీవాల్ ను హత్య చేస్తామని లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్​ సభ్యుడి పేరుతో వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. ఈ బెదిరింపులతో రాజకీయ నాయకులలో భయాందోళన వ్యక్తం అవుతుంది. ఢిల్లీ, ముంబైకు చెందిన రాజకీయ నాయకులు ఎప్పుడేం జరుగుతుందోనని బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

నేను లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి మాట్లాడుతున్నా. 7 కోట్ల రూపాయలు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్‌కు చెప్పు. లేదంటే కేజ్రీవాల్‌ను, ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ను చంపేస్తానని సదరు నిందితుడు బెదిరించినట్లు ఢిల్లీలోని తిలక్‌ నగర్‌ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్​ కాల్​ అనంతరం వాట్సప్‌ సందేశాలు కూడా పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్ డీటెయిల్ రికార్డులు , ఐపీ లాగ్‌లు , లొకేషన్​ గుర్తించి సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్ విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అదేవిధంగా బాలీవుడ్ బాద్ షా అమితాబ్ నివాసం జల్సా ని పేల్చేస్తామని మరోసారి బెదిరింపులు రావడంతో ముంబై ఉలిక్కి పడింది. నవంబర్ 27, డిసెంబర్ 31 తేదీలను ప్రస్తావిస్తూ పీఎన్‌బీ బ్రాంచ్‌లతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, మహాలక్ష్మి స్టేడియం, అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, ముంబై మేయర్ కార్యాలయాన్ని ఈ లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ మెయిల్‌ బెదిరింపులో పేర్కొన్నారు. గత 20 రోజుల వ్యవధిలోనే అమితాబ్ కు బెదిరింపులకు రావడం ఇది మూడోసారి. దాంతో ఆయన ప్రత్యేక బధ్రతా ఏర్పాటు చేసుకున్నారు.

అయితే కేజ్రీవాల్ ను చంపుతామని బెదిరింపులకు పాల్పడింది లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్ సభ్యుడు కాగా అమితాబ్ కు వార్నింగ్ ఇచ్చింది మాత్రం ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ అని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే అమితాబ్ ను బెదిరిస్తూ పంపించిన ఈ మెయిల్ లో ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ’ అనే పేరుతో పాటు ఖలిస్థాన్‌కు సంబంధించిన ప్రస్తావనలు కూడా ఉండటంతో పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. అయితే ఇవి నిజమేనా లేకపోతే నకిలీ బెదిరింపులా అనేది తేలాల్సి వుంది. అంతకుముందు అమితాబ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ నకిలీవని తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.

అలాగని నిర్లక్ష్యం చేయడానికి కూడా వీలు లేదు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు టైగర్ ష్రాఫ్‌ ఈ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. లేకపోతే ఏమి జరిగి ఉండేదో ఊహిస్తే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. నటులు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లను కూడా చంపుతామని గతంలో అనేక సార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.