ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జనసేన కార్యాలయంలోని కీలక నాయకుల పేర్లతో ఓ వ్యక్తి నిరుద్యోగులను మోసం చేయడం కలకలం సృష్టిస్తోంది. జనసేన కార్యాలయం పేరుతో లెటర్ హెడ్, పార్టీ చిహ్నం ఉపయోగించడంతో గుడ్డిగా నమ్మిన కొందరు నిరుద్యోగులు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించుకున్నారు. తీరా అదంతా మోసం అని తెలుసుకొని లబోదిబో అంటూ గుండెలు బాదుకుంటున్నారు.
గతంలో ఒక జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీలో పనిచేసిన గగర ధరణి అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడిన విషయం బయటపడింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన మంగళగిరి కార్యాలయంలో కోటా రుక్మిణి, కళ్యాణం శివ శ్రీనివాసరావుల మాట చెల్లుబాటవుతుందన్న విషయాన్ని గుర్తించిన ధరణి ఈ కుట్రకు తెరతీశాడు.
ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నిరుద్యోగులను తనకు జనసేన ముఖ్య నాయకులతో మంచి పరిచయం వుందని, వారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే ఎవరికైనా ఆశే కదా. చేతిలో డబ్బులు వున్నా లేకపోయినా అప్పో సప్పో చేసి ధరణి ఆడినంత ముట్ట చెప్పారు. మూడో కంటికి తెలియకుండా సుమారు 7 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసుకున్నాడు.
తనకు డబ్బులు ఇచ్చిన అమాయకులకు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయ లెటర్ హెడ్లతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చినట్లులో మీడియాలో కథనాలు వచ్చాయి. అసలు గుట్టు రట్టు కావడంతో ధరణి పరారయ్యడు. జనసేన కార్యాలయంలోని ప్రముఖుల పేర్లు అడ్డుపెట్టుకొని మోసానికి పాల్పడిన సంగతి తెలిసి ఆ పార్టీ నాయకులు ఉలిక్కి పడ్డారు. వెంటనే మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ కేసు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
