కియా అంటే ఏపీ… ఏపీ అంటే కియా

ఏపీలో కియా రెండో ప్లాంట్ విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. నవంబర్ 12-13 తేదీల్లో జరుగుతున్న ఈ సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు పలు దిగ్గజ కంపెనీల అధినేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కియా ఇండియా ఏపీలో రెండో ప్లాంట్ పెట్టబోతున్నట్లు ప్రకటించింది. కియా ఇండియా ఎండీ మరియు సీఈఓ గ్వాంగ్ లీ ఈ వివరాలు వెల్లడించారు.

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా ఆల్రెడీ అనంతపురంలో తమ మొదటి ప్లాంట్ విజయవంతంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన అనుబంధ సరఫరాదారులతో కలిసి ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. 465 ఎకరాల విస్తీర్ణంలో 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 17,000 కోట్లు) పెట్టుబడి పెట్టబోతోంది. ఈ పెట్టుబడితో కలిపి భారతదేశంలో కియా మొత్తం పెట్టుబడి 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఏపీలో రెండో ప్లాంట్ ద్వారా ఏటా అదనంగా 2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఏపీలోని కియా ప్లాంట్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఏటా 4.3 లక్షల నుండి 6.3 లక్షల వాహనాలకు చేరుకుంటుంది.
భారతదేశాన్ని కియా సంస్థకు ప్రధాన గ్లోబల్ ఎగుమతుల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ పెట్టుబడులు పెట్టుకున్నారు.

కియా, హ్యుందాయ్ సంస్థలకు విడిభాగాలు సరఫరా చేసే మూడు దక్షిణ కొరియా సంస్థలు తమిళనాడుకు బదులుగా ఏపీలోని అనంతపురం జిల్లాను ఎంచుకున్నాయి. ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం రూ. 1,614 కోట్ల పెట్టుబడితో 1,418 మందికి ఉపాధి కల్పించనున్నాయి.

హ్వాషిన్ సంస్థ రూ. 850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. సియోన్ సంస్థ రూ. 514 కోట్ల పెట్టుబడితో 918 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇవామెట్ సంస్థ రూ. 250 కోట్ల పెట్టుబడితో సుమారు 400 మందికి ఉపాధి అందించనుంది. కియాతో పాటు పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపాయి.