చంద్ర‌బాబుకు మరో ట్యాగ్

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు గురించి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జాతీయ మీడియా వాట‌ర్ మ్యాన్ అంటూ.. ప్ర‌శంస‌లు గుప్పించింది. దీనికి ఆయ‌న కూడా మురిసిపోయారు. అయితే.. ఇప్పుడు తాజాగా “ఇన్వెస్ట్ మెంట్ మెంటార్‌` అంటూ.. జాతీయ మీడియా ప్ర‌శంస‌లు గుప్పించింది. దీనికి సంబంధించిన కార‌ణాలు కూడా వివ‌రించింది. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి పారిశ్రామిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, నూతన సాంకేతిక విధానాలపై ప్రత్యేక దృష్టి సారించారని మీడియా ప్ర‌స్తావించింది.

హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి నాంది పలకడం నుండి నేటి నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి వరకు ఆయనను “పెట్టుబడుల రూపశిల్పి”గా అభివర్ణించింది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు, నివేదికల ప్రకారం, జూన్ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెట్టుబడుల ఆకర్షణలో కీలక మైలురాళ్లు నమోదయ్యాయని పేర్కొంది. జూన్ 2024 నుండి నవంబర్ 2026 నాటికి రాష్ట్రానికి అందిన 714 పెట్టుబడి ప్రతిపాదనలలో 526 ప్రాజెక్టులు (సుమారు 74 శాతం) ఆమోదం పొంది వాస్తవ రూపం దాల్చే దశకు చేరుకున్నాయని ఇది పూర్తిగా సీఎం సాధించిన అద్భుత విజ‌య‌మ‌ని బిజినెస్ స్టాండ‌ర్డ్ ప‌త్రిక వ్యాసంలో పేర్కొంది.

ఈ పెట్టుబ‌డుల విలువ రూ. 17.2 లక్షల కోట్లు కాగా, వీటి ద్వారా 19.3 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. జాతీయ స్థాయిలో గుర్తింపుపై ఏకంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ నివేదిక ప్ర‌చురించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన కొత్త పెట్టుబడి ప్రతిపాదనలలో ఆంధ్రప్రదేశ్ 25 శాతం వాటాను దక్కించుకుందని తెలిపింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.

పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండ‌డం క‌ల‌సి వస్తోంద‌ని ప‌లు నివేదిక‌లు పేర్కొన్నాయి. ‘ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీ 2026-31’, ‘రోబోటిక్స్ మరియు ఫిజికల్ ఏఐ పాలసీ 2026-36’, అలాగే సెమీకండక్టర్ పాలసీ సవరణలకు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా ఏపీకి మ‌రిన్ని పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని ప‌త్రిక‌లు వివ‌రించాయి.