ఏపీలో ఇప్పటికే ఫలితాలు వెల్లడైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో 23 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఏపీ ఎస్ఈసీ పునేఠా విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 26న పోలింగ్, 30వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ 23 స్థానాల్లో మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) కూడా ఉంది. దీంతో, మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి, ఆత్మకూరు, ఉండవల్లి, పెనుమాక, నవులూరు, ఎర్రబాలెం, కాజ, చినకాకాని, నిడమర్రు, పెదవడ్లపూడి… వంటి పలు గ్రామాల కలయికతో ఎంటీఎంసీ ఏర్పడింది. ఈ కార్పొరేషన్ కు జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. దీంతో, ఏపీ రాజధాని అమరావతికి పట్టుకొమ్మ వంటి ఈ కార్పొరేషన్ కు తొలి మేయర్ గా ఎవరు ఎన్నికవుతారు అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.
మేయర్ పీఠాన్ని కూటమి బలపరిచిన అభ్యర్థి కైవసం చేసుకుంటారని కూటమి నేతలు కూడా ధీమాగా ఉన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో 2024 ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేశ్ ను ప్రజలు గెలిపించారు. ఆ కృతజ్ఞతతో మంగళగిరి నియోజకవర్గ రూపు రేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేస్తున్నారు లోకేశ్. ఆ క్రమంలోనే ఎంటీఎంసీ కార్పొరేషన్ ను కూడా కైవసం చేసుకోవడం లోకేశ్ వంతు.
మరోవైపు, ఏపీలో మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. నవంబరు 26న తొలి విడత, 29న రెండో విడత, డిసెంబరు 2న మూడో విడత ఎన్నికల నిర్వహిచాలని ఎస్ఈసీ భావిస్తోందట. ఢిసెంబరు 5వ తేదీ నాటికి అన్ని స్థానాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు చేయాలని, డిసెంబరు 10వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలని పునేఠా భావిస్తున్నారట. అయితే, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అధికారికంగా రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
