జగన్, చంద్రబాబులో నాయకత్వ లక్షణాలు లేవని విజయసాయిరెడ్డి విమర్శించారు. విజనరీ అని చంద్రబాబు, ప్రజా నాయకుడిని అని జగన్ తమకు తామే డప్పు కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రజా నాయకుడు ఎలా ఉండకూడదు అనేందుకు వారిద్దరూ ఉదాహరణ అని విమర్శించారు. ప్రజల బాధలను అర్థం చేసుకునే ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నవాడే అసలైన లీడర్ అని చెప్పారు. అది లేకపోయినా ఉంది అని ప్రచారం చేసుకోవడంలో వారిద్దరూ దిట్ట అని విమర్శలు గుప్పించారు. ఏపీలో వైసీపీ, టీడీపీల ఆధిపత్యానికి ముగింపు పలకడమే తన పార్టీ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు.
భారత దేశంలో..ముఖ్యంగా ఇరు తెలుగు రాష్టాల్లో వారసత్వ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. సీఎం కొడుకే సీఎం కావాలా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జగన్, చంద్రబాబుల కుటుంబాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అహంకారపూరితమైన ఈ రెండు కుటుంబాల నాయకులు వద్దని అన్నారు. ఈ రెండు కుటుంబాల్లోని వ్యక్తులే సీఎం కావాలా? ఆ రెండు కుటుంబాల నుంచే మంత్రులు రావాలా? అని ప్రశ్నించారు. జెన్ జీ యువతలో ఉత్సాహాన్ని నింపి..నాయకత్వ లక్షణాలున్న యువతను ఎంపిక చేస్తానని చెప్పారు.
రాజకీయాల్లో యువతకు 66 శాతం అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ శూన్యత ఉందని, ప్రస్తుత పార్టీల తీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రతి సామాజిక వర్గంలో..ప్రతి కులంలో నాయకులుంటారని…వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి యువతను సీఎం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. భారీ తుఫానుకు ముందు ప్రశాంతతలా రాబోయే రాజకీయ ప్రళయానికి ..రాజకీయ ప్రక్షాళనకు ముందు ప్రశాంతతే ఇప్పుడు కనిపిస్తోందని చెప్పారు.
గత పాలకుల అరాచక పాలనపై విస్పోటనం ఏ విధంగా ఉంటుందో ఏపీ ప్రజలు చూడబోతున్నారని అన్నారు. పాత పరిపాలనకు దుష్ట పరిపాలనకు సవాల్ విసురుతూ ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కతికి పునాది వేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
