రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్పీ) అధ్యక్షుడు వి. విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో 66 శాతం సీట్లను యువతకు ఇస్తామని చెప్పారు. శాసన మండలిలో 60 శాతం సీట్లను కూడా యువతకు కేటాయిస్తామని తెలిపారు. తమ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 66 శాతం యువతకు అవకాశం ఇస్తామన్నారు. యువత అంటే.. 45 ఏళ్ల వయసులోపు ఉన్నవారేనని స్పష్టం చేశారు.
చట్టసభలో కూర్చోబెడతా..
యువతను వినియోగించుకోవాల్సింది.. కటౌట్లు కట్టేందుకు మాత్రమే కాదని.. చట్టసభల్లో కూర్చొబెట్టి వారి ద్వారా చట్టాలు చేయించే పనిని అప్పగించాలని సాయిరెడ్డి సూచించారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం చూస్తున్నారని.. కానీ, రాజకీయాల్లోకి వస్తే.. సమాజాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందని ఆయన హితవు పలికారు. ప్రతి ప్రాంతానికీ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి అంటే.. కేవలం విశాఖ, అమరావతి డెవలప్ అయితే.. అభివృద్ధికాదన్నారు. మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధికావాలన్నారు.
సాగునీరు పుష్కళం
తమ పీఆర్పీ.. అన్ని వర్గాలకు సానుకూల పార్టీ అని అన్నారు. రైతుల కోసం.. సాగునీటిని సమృద్ధిగా అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. వెయ్యి టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని.. 4 వేల టీఎంసీలకు తీసుకువెళ్తామని తద్వారా రైతులను ఆదుకుంటామన్నారు. రైతులకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. సాగునీరు సకాలంలో అందిస్తే.. అంతకుమించింది ఏమీలేదన్నారు. ఇతర ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని.. అలానే.. ఖజానాపై భారం పడకుండా విద్యుత్ అందిస్తామన్నారు.
యోగి ట్రీట్మెంటు..
రాష్ట్రంలో శాంతిభద్రతలు.. మహిళల రక్షణకు పీఆర్పీ ప్రాధాన్యం ఇస్తుందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాప్తాడు ఘటనలు రాష్ట్రంలో ప్రతివారం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకుంటామన్నారు. సంఘ విద్రోహ శక్తులు, మహిళలపై అరాచకాలకు పాల్పడేవారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంటు ఇస్తామని స్పష్టం చేశారు.
విజయ్ వచ్చారు.. మేం వస్తాం..
తమిళనాడులో మూడో ప్రత్యామ్నాయంగా.. టీవీకే అధిపతి విజయ్ అధికారంలోకి వచ్చారని అలానే తాము కూడా పీఆర్పీ పేరుతో అధికారంలోకి ఎందుకు రాకూడదని అన్నారు. కేవలం రెండు కుటుంబాలే ఏపీని పాలించాలా? అని ప్రశ్నించారు. తమకు బలం, బలగం మాత్రం ప్రజలేనని.. మేం ఎందుకు అధికారంలోకి రాకూడదని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తామని తేల్చి చెప్పారు.
వచ్చేయండి.. యువతకు పిలుపు
రెండు రాజకీయ పార్టీల్లో(టీడీపీ, వైసీపీ) మార్పు కోరుకుంటున్న నాయకులు, యువతకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. 2029 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో భారీ మార్పులు వస్తాయన్నారు. “మాకు చప్పట్లు మాత్రమే కాదు.. మీ భాగస్వామ్యం కావాలి. “ అని సాయిరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. “మేలుకో యువతరం.. కదలిరా నవతరం.. మా పిలుపే వందేమాతరం“అని నినదించారు.
వాటిలో ముస్లింలకు టికెట్లు
తమ పార్టీ ఒక కులానికి, ఒక మతానికి పరిమితం కాదని సాయిరెడ్డి ప్రకటించారు. అన్ని మతాలను… అన్ని కులాల ను గౌరవిస్తామన్నారు. ముఖ్యంగా తాము క్రిస్టియన్లు, ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. ఈ క్రమంలో కదిరి, రాయచోటి, కడప, మదనపల్లి, హిందూపురం నియోజకవర్గాల నుంచి ముస్లిం సోదరులనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పెడతామన్నారు. అలానే తాను క్రిస్టియానిటీకి వ్యతిరేకమని తనపై ప్రచారం చేస్తున్నారని, కానీ, తాను బలవంతపు మత మార్పిడులకు మాత్రమే వ్యతిరేకమన్నారు.
కులాలు లేని మతాల్లో..
“నేను హిందువునే. నేను రెడ్డి ఫ్యామిలీలో పుట్టాను. ఇది నా చేతిలో లేదు. నేను హిందువుగా పుట్టాను. నేను హిందువుగా చనిపోతాను. కానీ.. ఇతర మతాలను అవమానించను. నేను వ్యతిరేకించేది బలవంతపు మత మార్పిడులనే.“ అని స్పష్టం చేశారు. కులాలే లేని మతాల్లో.. రెడ్డి, కమ్మలు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. క్రిస్టియానిటీలో కులం లేదన్నారు. కానీ.. అక్కడ కూడా రెడ్డి, కమ్మ వంటివి పెంచేశారని అన్నారు. రాజకీయ స్వప్రయోజనం కోసం మతాలను, కులాలను వినియోగించవద్దన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
