వెలుగు త‌గ్గిన జ‌గ‌న్ `దీపావ‌ళి`!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ ఏడాది దీపావ‌ళి పండుగ‌కు దూరంగా ఉన్నారా? కేవ‌లం ప్ర‌జ‌ల‌కు ఎక్స్‌లో శుభాకాంక్ష‌లు చెప్ప‌డం వ‌ర‌కే ప‌రిమితం అయ్యారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఒక్క జ‌గనే కాదు.. వైసీపీ కార్యాలయాల వ‌ద్ద కూడా ఎలాంటి సంద‌డి క‌నిపించ‌లేదు. స‌హ‌జంగా దీపావ‌ళి అంటే.. వైసీపీ కార్యాల‌యాల‌ను విద్యుత్ దీపాల‌తో అలంక‌రిస్తారు. జ‌గ‌న్ స‌హా ఇత‌ర నాయ‌కులు పార్టీ కార్యాల‌యం నుంచి నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతారు. జ‌గ‌న్ కూడా త‌న స‌తీమ‌ణితో క‌లిసి దీపావ‌ళి చేసుకుంటారు.

గ‌త ఏడాది బెంగ‌ళూరు ప్యాలెస్‌లో భారీ ఎత్తున జ‌గ‌న్ ఈ దీపావ‌ళి పండుగ‌ను నిర్వ‌హించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ నాయ‌కులు కూడా జిల్లా ల వారీగా పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద సంబ‌రాలు చేసుకున్నారు. తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలో అయితే.. మ‌రింత ఎక్కువ‌గానే సంబరాలు చేసుకున్నారు. కానీ.. ఈ ద‌ఫా వెలుగులు క‌నిపించ‌లేదు. దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని వైసీపీ నేత‌లు ఎక్క‌డా కిమ్మ‌న‌లేదు. క‌నీసం.. పార్టీ కార్యాల‌యాల‌కు విద్యుత్ దీపాల అలంక‌ర‌ణ కూడా చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా విడుద‌లైన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ త‌గ‌ల‌డంతో నాయ‌కులు ఎక్క‌డి వారు అక్క‌డే సైలెంట్ అయ్యారన్న చ‌ర్చ‌సాగుతోంది. మ‌రోవైపు .. గెలిచిన వారిలోనూ పెద్ద‌గా సంతోషం లేదు. నిజానికి ఓడిపోయిన వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గెలిచిన నాయ‌కులు కూడా దీపావ‌ళికి దూరంగా ఉన్నారు. పార్టీ ప‌రంగా త‌మ‌కు పెద్ద‌గా సాయం అంద‌లేద‌న్న భావ‌న గెలిచిన వారిలో ఉంది. అదేస‌మ‌యంలో కొంద‌రు సొంత డ‌బ్బులు.. అప్పులు చేసి మ‌రీ ఖ‌ర్చు చేసుకున్నారు. దీంతో వైసీపీ నాయ‌కులు పూర్తిగా దీపావ‌ళిని నామ్‌కే వాస్తే.. అన్న‌ట్టుగా నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఇక‌, టీడీపీ కూట‌మి పార్టీల విష‌యానికి వ‌స్తే.. భారీ విజ‌యం న‌మోదు చేసిన ద‌రిమిలా.. రాష్ట్ర వ్యాప్తంగా దీపావ‌ళి సంబ‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో ల‌క్ష్మీదేవికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం దీపావ‌ళి బాణాసంచా కాల్సి సంబ‌రాలు చేసుకున్నారు. ప‌లువురు నాయ‌కుల‌కు ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు తేనీటి విందు ఇచ్చారు. ఇక‌, జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని కూడా విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. సంబ‌రాలు చేసుకున్నారు.