కూటమి విజ‌యం.. అంత ఈజీగా జ‌ర‌గ‌లేదు!

భౌతిక యుద్ధంలో అస్త్రాలు ప్ర‌యోజనం ఇవ్వొచ్చు. కానీ, ఎన్నిక‌ల యుద్ధంలో గెలవాలంటే మాత్రం అనేక ప‌రిణామాలు… ప్ర‌భావితం అవుతాయి. ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌డం.. ఒప్పించ‌డం..చివ‌ర‌కు వ‌ర‌కు ప‌ట్టు నిలుపుకొనే ప్ర‌యత్నం చేయ‌డం.. వంటివి అత్యంత కీల‌కం. అంతేకాదు.. పోలింగ్ బూత్‌వ‌ర‌కు వ‌చ్చిన ఓట‌రు మ‌దిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని సిరా వేసే వ‌ర‌కు.. ష‌రా త‌ప్ప‌కుండా ఓటు గుద్దించుకోవ‌డం అనేది ఇప్పుడు రాజ‌కీయాల్లో అత్యంత సునిశిత అంశంగా మారింది.

ఒక‌ప్పుడు క‌ర‌డు గ‌ట్టిన పార్టీల అభిమానం ఉండేది. దీంతో ఎవ‌రు ఎన్ని ప్ర‌చారాలు చేసినా.. తాము ఆది నుంచి న‌మ్మిన పార్టీకే.. ఓటు వేసిన ప‌రిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. దీంతో ప్ర‌జ‌లు కూడా ఆలోచ‌న చేస్తున్నారు. పోలింగ్‌బూత్ వ‌చ్చే వ‌ర‌కు కూడా ప‌రిస్థితులు మారుతున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌చారాల‌తోపాటు.. వ్య‌క్తి గ‌త అభిలాష‌లు కూడా మారుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ప్రభావితం అవుతున్నాయి. ఈ త‌ర‌హా ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు పార్టీల ప‌రంగా ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది.

ఈ ప‌రంగా చూస్తే.. టీడీపీ విష‌యంలో దూకుడు క‌నిపిస్తోంది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ స‌మ‌ర్థ‌వంత‌మైన వ్యూహాల‌నే అమ‌లు చేసింది. అంతేకాదు.. అంత‌కుమించి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది. ఒక‌వైపు పార్టీ నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచ‌డంతో పాటు.. నాయ‌కుల‌కు నిర్దేశిత ల‌క్ష్యాలు విధించారు. ఈ క్ర‌మంలో బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌కు తావులేకుండా.. పార్టీ ల‌క్ష్యాల‌ను వివ‌రించ‌డం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. అంటే.. పార్టీ బ‌లంగా ఉంటేనే గెలుస్తామ‌న్న సందేశాన్ని ప్ర‌తికార్న‌ర్‌కు తీసుకెళ్ల‌డంలో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది.

ఇదేస‌మ‌యంలో కూట‌మిపార్టీలైన జ‌న‌సేన‌, బీజేపీల‌ను ఐక్యంగా ఉంచ‌డంలోనూ టీడీపీ వ్యూహం ఫ‌లించింది. అలానే.. ఈ వ్యూహానికి మించి.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే విష‌యంలోనూ పార్టీ నిర్దేశిత కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేసింది. దీనిలో భాగంగానే అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఐవీఆర్ఎస్ స‌ర్వేతోపాటు క్షేత్ర‌స్థాయి నుంచి కూడా నివేదిక‌లు తెప్పించుకుని క‌స‌ర‌త్తు చేయ‌డం పూర్తిగా ఫ‌లించింద‌నే చెప్పాలి. త‌ద్వారా ఎన్నిక‌ల్లో నేరుగా ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో కూట‌మి విజ‌యం మ‌రింత సునాయాసం అయింద‌ని అన‌డంలో సందేహం లేదు.

ఒక పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉన్నామ‌ని అనుకోవడం వేరు.. ఎప్ప‌టిక‌ప్పుడు బ‌లోపేతం అయ్యేందుకు అనుస రించేమార్గాల‌ను అన్వేషించి.. వాటికి అనుగుణంగా ముందుకు సాగ‌డం వేరు. ఈ రెండోనియ‌మాన్నే కూట‌మి పార్టీలు అనుస‌రించాయి. త‌ద్వారా అప్ర‌తిహ‌త విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక్క‌డ మ‌రో కీల‌క అంశం ఏంటంటే.. ఈ విజ‌యం ఒక్క‌రాత్రి వ‌చ్చింది కాదు. ఒక్క రోజులో ద‌క్కింది కూడా కాదు. అధికారంలోనే ఉన్న‌ప్ప‌టికీ సుమారు ఏడాది ముందు నుంచి టీడీపీ, జ‌నసేన‌లు విస్తృతంగా క‌స‌ర‌త్తు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదే ఇప్పుడు వారికి ఫ‌లితాల‌ను తీసుకువ‌చ్చింది.