రూ.500 నోట్ల రద్దు ఇప్పుడు సమంజసమేనా బాబు గారు?

పెద్ద నోట్ల రద్దు సమయంలో చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హఠాత్తుగా నోట్ల రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే, నల్లధనం వెలికితీత, దొంగనోట్లకు చెక్ పెట్టడం, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం వంటి పలు కారణాలతో మోదీ నోట్ల రద్దు వంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే, నోట్ల రద్దు గురించి ప్రధాని మోదీ కంటే ముందే టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేశారు. టెక్నాలజీ వాడకంలో ఎప్పుడు మిగతా ముఖ్యమంత్రుల కంటే ఒక అడుగు ముందు ఉండే చంద్రబాబు నోట్ల రద్దు, డిజిటల్ కరెన్సీ ప్రతిపాదనలను ప్రధాని మోదీ ముందుంచారు.

అందుకే, నోట్లరద్దు సమయంలో చంద్రబాబు మరో ప్రతిపాదన కూడా తెచ్చారు. కేవలం 1000 రూపాయల నోటు మాత్ర కాదని, రూ.2000, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే చలామణీలో ఉండాలని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబు అదే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. టెక్నాలజీ పర్ఫెక్ట్‌గా ఉంటే సంపద సృష్టించడం కష్టం కాదని, పేదరిక నిర్మూలన సాధ్యమేనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన తానే తీసుకొచ్చానని చంద్రబాబు అన్నారు. రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్లు లేకుండా.. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలని చంద్రబాబు మరోసారి కోరారు. డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ తానే ఇచ్చానని, ఆ రోజు కూడా ప్రధాని మోదీని కోరానని, ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నానని, మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు.

అయితే, నోట్ల రద్దు వల్ల గతంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో నగదు కొరత, బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలు, వ్యాపార లావాదేవీలకు అంతరాయం వంటి సమస్యలు తలెత్తాయి. డిజిటల్ చెల్లింపులు పెరగడానికి నోట్ల రద్దు కొంతవరకు దోహదపడినా, దేశంలో అవినీతిని, నల్లధనాన్ని పూర్తిగా అరికట్టలేకపోయిందన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.

మరోవైపు, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, నకిలీ నోట్లను అరికట్టడం మంచి లక్ష్యాలే అయినప్పటికీ.. ప్రస్తుతం రెట్లు పెరిగిపోవడం, కుటుంబ ఖర్చులకు సైతం 500 నోటు కనీసం అయిపోయిన సందర్భాల్లో అవినీతి మూలాలను పరిష్కరించకుండా మరోసారి నోట్ల రద్దు వంటి నిర్ణయం తీసుకుంటే సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.