అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక చర్యలకు దిగవచ్చన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో అణు కేంద్రాల చుట్టుపక్కల నివసించే ప్రజల భద్రతపై చర్చ మొదలైంది. రేడియేషన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అయోడిన్ మాత్రలు అందిస్తున్నారంటూ బ్రిటన్ మీడియా కథనం ప్రచురించడం సంచలనంగా మారింది. అయితే ఈ వార్తలను ఇరాన్ అధికారులు ఖండించడంతో అసలు పరిస్థితిపై ఆసక్తి నెలకొంది.
బ్రిటన్‌కు చెందిన ‘ది టైమ్స్’ కథనం ప్రకారం, ఇరాన్‌లోని అణు స్థావరాలకు సమీపంలో నివసించే వారికి ఆరోగ్య అధికారులు పొటాషియం అయోడైడ్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను రేడియోధార్మిక అయోడిన్ ప్రభావం నుంచి కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ కథనం పేర్కొంది. అణు కేంద్రాల సమీపంలోని జనావాస ప్రాంతాల్లో ముందస్తు భద్రతా ఏర్పాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించింది.
అయితే ఈ వార్తలపై ఇరాన్ ఆరోగ్య శాఖ మరో విధంగా స్పందించింది. తమ శాఖకు చెందిన అధికారులు ఎవరూ బ్రిటన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. తమ అధికారుల పేరుతో ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆరోగ్య శాఖ ప్రజా సంబంధాల విభాగం అధిపతి హుస్సేన్ కెర్మాన్‌పూర్ పేర్కొన్నారు. దీంతో అయోడిన్ మాత్రల పంపిణీపై వచ్చిన సమాచారం నిజమా? ముందస్తు సన్నద్ధతకు సంబంధించిన నివేదికనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయోడిన్ మాత్రల గురించి వైద్యపరంగా చూస్తే.. అణు ప్రమాదం జరిగినప్పుడు రేడియోధార్మిక అయోడిన్ గాలిలోకి విడుదలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే థైరాయిడ్ గ్రంథిలో పేరుకుపోయి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో పొటాషియం అయోడైడ్ మాత్రలు థైరాయిడ్ గ్రంథిలో సాధారణ అయోడిన్‌ను నింపి రేడియోధార్మిక అయోడిన్ చేరకుండా కొంతవరకు అడ్డుకుంటాయి. అయితే ఇవి రేడియేషన్‌కు పూర్తి రక్షణ కావు. ఇతర రకాల రేడియోధార్మిక పదార్థాల నుంచి కూడా కాపాడలేవు. వైద్యుల లేదా ప్రభుత్వ ఆరోగ్య విభాగాల సూచనల ప్రకారమే వీటిని ఉపయోగించాలి.
ఇక ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక స్థావరాలపై అమెరికా దృష్టి సారించిందన్న వార్తలు పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన అణు కేంద్రాలపై దాడి చేయడం అంత సులభం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి వ్యూహంపై తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates