అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అన్న వరుసయ్యే వ్యక్తి వేధింపుల కారణంగా దారుణ దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగవుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆమె స్పృహలోకి రావడమే కాకుండా, శస్త్రచికిత్సల అనంతరం లేచి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తన తాజా హెల్త్ అప్‌డేట్‌లో వెల్లడించారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపిక తాజా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నానని మంత్రి లోకేష్ తెలిపారు. గోపిక కుడి భుజానికి సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. చిన్నారి ఆరోగ్యం క్రమంగా సాధారణ స్థితికి రావడంతో వైద్యులు ఇప్పటికే వెంటిలేటర్‌ను తొలగించారని, ప్రస్తుతం ఆమె ఎటువంటి సపోర్ట్ లేకుండా సొంతంగా శ్వాస తీసుకోగలుగుతోందని పేర్కొన్నారు.
ఆసుపత్రి బెడ్‌పై నుంచి లేచి నడిచేందుకు గోపిక ఎంతో ఉత్సాహం చూపిస్తోందని, ఆమెలో మంచి మనోధైర్యం కనిపిస్తోందని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్నారికి నోటి ద్వారా కొద్దికొద్దిగా ద్రవ ఆహారాన్ని అందిస్తున్నారని.. అయితే.. శనివారం ఉదయం నాటికి కొద్దిగా ఘన ఆహారం కూడా తీసుకుందని వివరించారు. అలానే ఆమె లేచి నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆమె కోలుకునే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. బాలిక ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హేమంత్ పరిస్థితి ఇదీ..
గోపికపై అమానుషంగా దాడికి పాల్పడి, ఎలక్ట్రిక్ రంపంతో హతమార్చేందుకు ప్రయత్నించిన హేమంత్ ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. అనంతపురం జిల్లా వైద్య శాలలో చికిత్స పొందుతున్నాడు. అతని కుడికాలు ఇన్‌ఫెక్షన్ కారణంగా.. మోకాలి వరకు తీసేసిన విషయం తెలిసిందే. దీంతో గత రెండు రోజుల పాటు జ్వరం వచ్చిందని.. తర్వాత తగ్గుముఖం పట్టిందని వైద్యులు తెలిపారు. మరోవైపు.. పోలీసులు హేమంత్‌కు భద్రతను పెంచారు. అతనిపై దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఆరోగ్యం కుదుట పడేందుకు మరో రెండు వారాలు పట్టవచ్చనివైద్యులు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates