ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇక్కడ కూడా రిపీట్ అయ్యాయి. ఈ ఫలితాల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు తమ అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలు జరిగాయి..అన్యాయం జరిగింది అంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇక, మాజీ మంత్రి రోజా వంటి నేతలు ఆ ఫ్రస్ట్రేషన్ ను సొంత పార్టీ కార్యకర్తలు, అనుచరులపై చూపిస్తున్న వైనం షాకింగ్ గా మారింది.
నగరిలో రోజా సంయమనం కోల్పోయారు. తనకు మంచినీళ్ల బాటిల్ ఇచ్చిన కార్యకర్తపై చిందులు తొక్కారు. అంతేకాదు, ఆ వాటర్ బాటిల్ విసిరి కొట్టి చిరాకుపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిత్తూరు జిల్లా ఇలత్తూరు ఎంపీటీసీ ఫలితంపై రోజా అసహనం వ్యక్తం చేస్తూ తన వాహనంలోనే నిరసనకు దిగారు.
ముందుగా, వైసీపీ అభ్యర్థి 10 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారని, ఆ తర్వాత రీ కౌంటింగ్ లో టీడీపీ అభ్యర్థి 3 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎలా వెల్లడించారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తన వాహనంలోనే రోజా నిరసనకు దిగి కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళా పోలీసులు వారిస్తున్నారు. అయితే, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం..పోలీసులవి నీతిమాలిన రాజకీయాలు అంటూ వాహనం నుండే రోజా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజాకు వాహనంలో వెనక సీటులో ఉన్న అనుచరుడు నీళ్ల బాటిల్ ఇచ్చాడు.
దీంతో, ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన రోజా..ఆ బాటిల్ ను విసిరి బయటపడేశారు. అంతేకాదు, ఆ అనుచరుడిపై కన్నెర్ర చేసిన రోజు..అతడిపై చేయి చేసుకున్నారు. వాస్తవానికి రోజా బాధలో కన్నీటిపర్యంతమైన సందర్భంలో ఆమెను ఓదార్చాలన్న ఉద్దేశ్యంతో అనుచరుడి నీళ్లు ఇచ్చాడు. కానీ, దానికి కూడా రోజా సహనం కోల్పోయి అలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. గొంతు తడి ఆరిపోయి ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో నీళ్లు ఇవ్వడం కూడా పాపమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా దురుసుగా ప్రవర్తించే రోజా చెడ్డపేరు తెచ్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates