జనసేన పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ తరఫున ఎన్నో ఆశలతో మండల పరిషత్ ఎన్నికల్లో రంగంలోకి దిగిన అభ్యర్థిని హఠాన్మరణం చెందారు. నిజానికి శనివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. దాదాపు ఆమె గెలుపుపై పార్టీ కూడా ఒక అంచనాకు వచ్చింది. సంబరాలకు కూడా కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో అభ్యర్థిని హఠాన్మరణం చెందడంతో జనసేన నాయకులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పార్టీ కార్యాలయం శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ప్రకటన చేసింది. పార్టీ తరఫున నిరంతరం పనిచేసిన ఓ నాయకురాలిని కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది. కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది.
ఎవరు? ఏం జరిగింది?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలానికి చెందిన గార్లపాటి దివ్య, శ్రీనివాస్ దంపతులు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారిగా దంపతులకు జనసేనాని పవన్ కల్యాణ్ కితాబిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా వీరు నివసిస్తున్న దేవరిపల్లి మండలంలోని ధుమంతునిగూడెం ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఈ సీటును గార్లపాటి దివ్యకు కేటాయించారు. చాలా ఉత్సాహంగా దంపతులు ఇద్దరూ ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. గురువారం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో దివ్యకు భారీ స్పందన వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, శనివారం ఉదయం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు లెక్కించేందుకు రంగం రెడీ చేశారు. ఈ పనుల్లో హడావుడిగా ఉన్న దివ్య ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాయి. ఆమె గత రెండు రోజుల కిందటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడంతో వైద్యులను సంప్రదించారు. చికిత్స చేయిం చుకుని మందులు వాడుతున్నట్టు భర్త శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు, కార్యకర్తలతో మాట్లాడేందు కు బయలుదేరుతున్న సమయంలో దివ్య మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ.. రాత్రి సమయంలో కన్నుమూశారు.
మూడు నెలల కిందటే..
దివ్య, శ్రీనివాస్ దంపతులకు.. ఓ కుమారుడు ఉండగా.. మూడు నెలల కిందట మరో చిన్నారికి జన్మనిచ్చారు. అప్పటి నుంచి ఆమెకు ఆరోగ్య సమస్యలు ప్రారంభమైనట్టు శ్రీనివాస్ తెలిపారు. కాగా.. దివ్య మృతి చెందిన ఘటన తెలియడంతో ధుమంతుని గూడెంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దివ్య కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరఫున కూడా సాయం అందించేలా చేస్తానని హామీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates