కూట‌మి వాల్యూ తెలిసిందా త‌మ్ముళ్లూ.. !

ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణంగా మారింది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్లనే గ‌తంలో సార్వ‌త్రికం అయినా.. ప్ర‌స్తుతం జ‌రిగిన కీల‌క స్థానిక‌ ఎన్నికల్లో అయినా.. భారీ విజయాలు సాధ్యమవుతున్నాయని పలు రాజకీయ విశ్లేషణలు, ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ కూటమి ప్రభావం, గెలుపు సాధ్యాసాధ్యాల ఈ మూడు పార్టీల్లోనూ ఇప్పుడు విస్తృతంగా చ‌ర్చ సాగుతోంది.

ఓట్ల చీలికకు చెక్‌
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేయడమే ఈ కూటమి ప్రధాన వ్యూహం. గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యూహం విజయవంతమైంది. ఈ మూడు పార్టీల ఉమ్మడి ఓట్ల శాతం 53% పైగా నమోదు కావడం వల్ల 175 స్థానాలకు గాను కూటమి 164 స్థానాల్లో చారిత్రాత్మక విజయం సాధించింది. ఇప్పుడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా.. కూడా ఇదే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. ఎంత బాగా చేసినా.. అంతో ఇంతో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త కామ‌న్‌గా ఉంటుంది. అయితే.. దానిని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేలా కూట‌మి సీట్ల స‌ర్దుబాటు క‌నిపించింది.

ప్ర‌స్తుతం జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఫార్ములా పెద్ద ఎత్తున పనిచేసింది. పులివెందుల, కడప వంటి విపక్షాల బలమైన కోటలతో పాటు మెజారిటీ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది. టీడీపీ అనుభవం, జనసేన యువశక్తి-సామాజిక బలం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ అండ కలిసి రావడం కూటమికి అతిపెద్ద బలంగా మారింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి నేతలు కూటమి ఐక్యతను నిలబెట్టడానికి క్రమం తప్పకుండా ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే, సీట్ల సర్దుబాటు సమయంలో స్థానిక నాయకుల మధ్య చిన్నపాటి అసంతృప్తులు తలెత్తినప్పటికీ, గెలుపే లక్ష్యంగా అధిష్టానాలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఒంటరి పోరాటం కంటే ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా ఉన్నప్పుడే రాష్ట్రంలో సుస్థిరమైన విజయం లభిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో అధికారం ద‌క్కించుకునేందుకు కూడా.. పార్టీల ఐక్య‌త ఎంత అవ‌స‌ర‌మో.. ఈ ఎన్నిక‌లు చాటుతున్నాయ‌ని చెబుతున్నారు. సో.. చిన్న‌పాటి అంశాల‌కే గొడ‌వ‌లు ప‌డే త‌మ్ముళ్లు ఈ విష‌యాన్ని గ్ర‌హించాల‌ని కూడా సూచిస్తున్నారు.