జగన్, విజయ్ కలిస్తే… ఐతే ఏంటంటా?

వైసీపీ అధినేత జగన్ బాబాయి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం వేడుక చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహనికి అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, సినిమా ప్రముఖులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదంతా మామూలే. ఈ పెళ్ళికి హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్లోజ్ గా మూవ్ కావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవుతుంది అనడం కంటే వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు.

సీఎం విజయ్, జగన్, కేటీఆర్ కలిసివున్న ఫోటోలను తెగ ప్రచారం చేస్తున్న వైసీపీ శ్రేణులు ఏంటో జరిగిపోతుంది అన్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిస్తే దక్షిణాదిలో మంటలు పుట్టడం ఖాయమని హైప్ క్రియేట్ చేసేందుకు తంటాలు పడుతున్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణాలో బీఆర్ఎస్ ఈ పెళ్లి ఫోటోలతో హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, దానిమీద పెట్టిన కామెంట్లు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొస్తుంది. అయితే ఏంటంటా…జగన్, విజయ్ కలిసినంత మాత్రానా ఏమౌతుందంటా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి విజయ్ ఈ పెళ్ళికి హాజరుకావడానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల కంటే వ్యాపార కారణాలతోనే విజయ్ ఆ పెళ్ళికి హాజరైనట్లు ప్రచారం జరుగుతుంది. అనిల్ కు తమిళనాడులో వ్యాపారాలు వున్నాయి. బలమైన ఆర్థిక నేపథ్యం కలిగిన ఆయన విజయ్ కోటరీలో కీలక పాత్ర పోషిస్తున్నాడన్న ప్రచారం జరుగుతుంది. జగన్ కు అనిల్ బాబాయ్ కుమారుడు, వరసకు తమ్ముడు కనుక ఆయన కూడా కుటుంబ సభ్యులతో కలిసి పెళ్ళికి హాజరయ్యారు. వ్యాపార సంబందాల్లో భాగంగానే కేటీఆర్ ను కూడా పెళ్ళికి పిలిచారు. అలా ఒక పెళ్లిలో కలిసి దిగిన ఫోటోలను వైసీపీ శ్రేణులు రాజకీయంగా వాడుకోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే జగన్ ప్రచార యావ పట్ల రాష్ట్రంలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చావుకు వెళ్లినా, పరామర్శ పేరుతో జైలుకు వెళ్లినా, పార్టీ నాయకుల కుటుంబాల్లో పెళ్ళికి వెళ్లినా జన సమీకరణ చేయించడం, దాన్ని సోషల్ మీడియాతో పాటుగా సొంత మీడియాలో ప్రచారం చేసుకోవడం షరా మామూలై పోయింది. దాని కొనసాగింపులో భాగంగా గానే చెన్నై పెళ్లిని కూడా ప్రచారం చేసుకుంటున్నారని కూటమి నాయకులు విమర్శిస్తున్నారు.