బంగ్లాదేశ్ వీడియోతో అమరావతిపై తప్పుడు ప్రచారం!

మురసు తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. కుండపోత వర్షం, భయంకరమైన ఈదురు గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేక చీకట్లోనే వున్నారు. ప్రజల ఇక్కట్లను గాలికి వొదిలేసిన వైసీపీ నాయకులు రాజధాని అమరావతి నీట మునిగిందని తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు. ఎక్కడో బంగ్లాదేశ్ లోని వీడియోలు తీసుకొచ్చి అమరావతిలో వరద నీటిని తోడుతున్నట్లు ప్రచారం చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఫ్యాక్ట్ చెక్ చేయించింది. ఆ వీడియో బంగ్లాదేశ్ కు సంబందించినదని తేల్చింది.

అమరావతిలో వరద నీటిని మోటార్లు తోడుతున్నారని, నీటిని తోడే కాంట్రాక్టర్ ఎంత అదృష్టవంతుడో అని వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన కొన్ని అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఈ వీడియోలను వైరల్ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఆ వీడియోలను పరిశీలించగా దాని మీద బెంగాలీ భాషలో చాలా యంత్రాలు ఒకేసారి నడుస్తున్నాయని స్పష్టంగా రాసి ఉండటం కనిపించింది. బంగ్లాదేశ్‌లో ఆక్వాకల్చర్ లేదా వ్యవసాయ నీటి నిర్వహణకు సంబంధించిన పాత వీడియో అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

ఎక్కడో దేశం కాని దేశంలోని వీడియోలు తీసుకొచ్చి ఇక్కడి దృశ్యాలుగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం పట్ల తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం పట్ల వ్యతిరేకించే హక్కు వైసీపీకి ఎంతగా వుందో సమర్థించే హక్కు కూడా అంతే ఉంటుంది. ఏదైనా సమస్య వుంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చే ప్రయత్నాలు చేయడం ప్రతిపక్షం బాధ్యత. అందుకు విరుద్ధంగా అసలు ఎలాంటి సమస్య లేకపోయినా ఏదో జరుగుతుందని క్రియేట్ చేయడం దారుణం. ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదని రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.

అమరావతి రాజధాని గురించి వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం గడపదాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్న నానుడి వైసీపీ ఫేక్ ముఠాలకు వర్తిస్తుందని, ఇటువంటి అబద్ధపు ప్రచారాలతో అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాల కోసం తవ్విన పునాది గుంతలు, కొన్ని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై తాత్కాలికంగా నీరు చేరిన మాట వాస్తవమే కానీ, రాజధాని మొత్తం మునిగిపోయిందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.