ఒకే వేదికపై జగన్, విజయ్, త్రిష, కేటీఆర్

కొన్ని నెలల ముందు చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం.. ఆ పెళ్లికి టీవీకే అధినేత విజయ్ కూడా హాజరు కావడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీశాయి. ఆ ఫొటోలు పెట్టి జగన్‌కు ఆయన అభిమానులు ఎలివేషన్లు వేసుకున్నారు.

విజయ్ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాక కూడా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆ గెలుపు వెనుక జగన్ ఉన్నాడని చెప్పుకున్నారు. కానీ అదే వేడుకలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కూడా జగన్ కలిసిన విషయాన్ని విస్మరించారు. ఆ సంగతి పక్కన పెడితే.. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ జగన్, విజయ్ ఒకే వేదిక మీదికి వచ్చారు. ఈసారి కూడా పెళ్లి వేడుకలోనే కావడం విశేషం.

వైఎస్ కుటంబానికి చెందిన అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లి తాజాగా చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందులో రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. జగన్ సతీ సమేతంగా ఈ పెళ్లికి వెళ్లారు. మరోవైపు విజయ్.. తన స్నేహితురాలు త్రిషతో ఈ వేడుకకు రావడం విశేషం. మరోవైపు తెలంగాణ అగ్ర నేతల్లో ఒకరు, మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. వీళ్లందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కి ఫొటోలకు పోజులు ఇచ్చారు.

ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ, టీవీకే, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య అధికారిక బంధం లేదు, అందుకు అవకాశం కూడా లేదు కానీ.. ఆ పార్టీల అధినేతలతో పాటు వాటి కార్యకర్తలు కొంచెం సన్నిహితంగానే మెలుగుతుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రేప్పొద్దున కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంటే.. ఈ మూడు పార్టీలు ఒకవైపు నిలిస్తే ఆశ్చర్యమేమీ లేదు.