కొండా మేడమ్ తో పాటు ఇంకా చాలామంది క్షమాపణ చెప్పాలి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రెండేళ్ల క్రితం సంచలన ఆరోపణలు చేసిన వైనం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. మరోవైపు, ఇటీవల మంత్రి పదవి పోగొట్టుకున్న సురేఖ పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీలో సురేఖకు తలుపులు మూసుకుపోవడంతో ఆమె బీఆర్ఎస్ వైపే అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెండేళ్ల తర్వాత కేటీఆర్ కు సురేఖ క్షమాపణలు చెప్పడం, తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ రోజు కేటీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా కేటీఆర్ కు కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన విషయం గురించి కేటీఆర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మొన్న ఒక పేపర్ క్షమాపణలు చెప్పిందని, ఈ రోజు ఈ మేడం క్షమాపణలు చెప్పారని అన్నారు.

వీళ్లే కాదని, వరుసలో చాలామంది ఉన్నారని, ఇంకా చాలామంది భవిష్యత్తులో తనకు క్షమాపణలు చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ తో పాటు పలు విషయాల్లో తనపై కొందరు తీవ్ర ఆరోపణలు చేశారని, వారంతా కూడా పశ్చాత్తాప పడి క్షమాపణలు చెబుతారని అన్నారు.

నిజం ఎప్పటికైనా నిలకడ మీద తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. అయితే, తాను మీడియా సమావేశానికి వచ్చిన తర్వాత ఈ క్షమాపణల గురించి తెలిసిందని, కొండా సురేఖ ఏం ట్వీట్‌ చేశారో ఇంకా చూడలేదని వ్యాఖ్యానించారు. మరి, ఎక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండే కేటీఆర్…కొండా సురేఖ ట్వీట్ పై ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.