కేటీఆర్ చెప్పినట్టే దిగొచ్చిన కొండా సురేఖ

రెండేళ్ల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అప్పటి మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మహిళ మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఓ మహిళపై సంచలన ఆరోపణలు చేసిన సురేఖపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

అయితే, తన గురించి అడ్డగోలుగా మాట్లాడిన సురేఖ తనకు క్షమాపణ చెప్పే వరకు ఆమెను వదిలిపెట్టబోనని, క్రిమినల్, సివిల్ కేసులు పెడతానని కేటీఆర్ రెండేళ్ల క్రితం చెప్పారు. ఆయన అన్నట్లుగానే సురేఖపై కేటీఆర్ న్యాయపోరాటం చేశారు. చివరకు ఆయన చెప్పిట్లుగానే తాజాగా కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.

కేటీఆర్ పై గతంలో తాను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల గురించి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నానని సురేఖ అన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కేటీఆర్ ను విమర్శించానని చెప్పారు. అయితే, తాను ఉద్దేశ్యపూర్వకంగా కేటీఆర్ ను కించపరచలేదని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. ఆనాడు అలా నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలన్న ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. కేటీఆర్, ఆయన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతో అలా మాట్లాడలేదని అన్నారు. తన వ్యాఖ్యలు కేటీఆర్ ను గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తున్నానని అన్నారు. అంతేకాదు, ఆనాడు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.

అయితే, గతంలో సురేఖపై సినీ నటుడు నాగార్జున కూడా పరువు నష్టం కేసు వేశారు. ఆ తర్వాత సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో కేసు వెనక్కి తీసుకొని రాజీ పడ్డారు. మరి, అదే మాదిరిగా కేటీఆర్ కూడా కేసును వెనక్కి తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.