ఏపీ సీఎం చంద్రబాబు ఆర్నబ్ తుఫాను ఎఫెక్ట్ వేళ 32 వేల మందితో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి సరికొత్త రికార్డు ను నమోదు చేశారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో అన్ని శాఖల అధికారులతోనూ నిరంతరాయంగా ఆయ న టచ్‌లో ఉన్నారు. ఒకే సారి 32 వేల మంది అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడంతోపాటు.. వారి పనితీరును తెలుసుకున్నారు. తాను తగు సూచనలు ఇస్తూనే స్థానికంగా ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుని దానికి తగిన విధంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు సహా ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్న చంద్రబాబు.. ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావానికి గురైన వారికి అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. గత 36 గంటలుగా నిర్విరామంగా సేవలు చేస్తున్న అధికారులు.. అదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం సూచించారు. రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు పంట, ఇతర నష్టాలను కూడా చంద్రబాబుకు వివరించారు.
కేంద్రానికి లేఖ
మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు తాజాగా లేఖ రాశారు. ప్రస్తుతం ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో విపత్తు సంభవించిన ప్రాంతాల్లో సాయం చేసేందుకు కేంద్ర బలగాలను తక్షణమే పంపించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు చంద్రబాబు లేఖ పంపించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత లేకపోయినా.. మరింత మందిని ఆదుకునేందుకు కేంద్రం నుంచి బలగాలను పంపించాలని సూచించారు. అలానే ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలను కూడా పంపాలని కోరారు.
ఆహారం.. నీరు..
విపత్తు కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే తగు చర్యలు తీసుకునేందుకు వీలుగా నిధులను మంజూరు చేశామని.. వాటిని ఖర్చు చేయాలనిపేర్కొన్నారు. ఆహారం, తాగునీరు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నా రు. ప్రతి ఒక్కరూ సమయ స్ఫూర్తిగా వ్యవహరించి పనిచేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates